కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. బయట అడుగు పెట్టాలంటేనే జనం గజగజలాడిపోతున్నారు. ఎప్పుడు ఏవిదంగా ఏ రూపంలో అటాక్ చేస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ఓ మేలు కూడా చేస్తోంది. అదేంటంటే భూగోళంపై వాతావరణ కాలుష్యం తగ్గించడం. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమవడంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో.. వాతావరణంలో కాలుష్యం తగ్గిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు అందింది. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ సారి తొందరగా అడుగుపెట్టేస్తున్నాయి. దీంతో నగరవాసుల్లోనే కాదు.. అటు రైతు కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 

 

2020లో వర్షాలు తొందరగా వచ్చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరణుడు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. మే 16వ తేదీకే అండమాన్‌ కి నైరుతి రుతుపవనాలు చేరుకోనున్నాయి. కరోనా లాక్‌డౌన్ వల్ల... రవాణా లేకపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటంతో... గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు తగ్గిపోవడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాలుష్యం లేక పోవడంతో వాతావరణంలో వేడి పూర్తిగా తగ్గిందని తెలిపింది వాతావరణ శాఖ. ఫలితంగా నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో మే 16న నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని చేరబోతున్నాయి. నాలుగు రోజుల ముందే వస్తున్నట్టు ప్రకటించింది వాతావరణశాఖ.

 

మరోవైపు.. మే 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. అది మూడ్రోజుల్లో బలంగా మారి మధ్య బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఫలితంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. ఇక మహారాష్ట్రలోని విదర్భ నుంచి మొదలై తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకూ విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి కారణంగా కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
అయితే రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని.. తెలంగాణలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: