ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల దగ్గర ఉండే సందడి అంతా ఇంతా కాదు. తనకున్న పరిచయాలతో ఏదో ఒక రకంగా టికెట్లు దక్కించుకుని ఎమ్మెల్యే , ఎంపీ ఏదో ఒక టికెట్ దక్కించుకుని విజయం సాధించాలని ఆశతో చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో రొటీన్ గా సాగే వ్యవహారమే ఇది. అయితే అందులో కొంతమంది గెలుస్తారు. మరికొంతమంది ఓటమి చెందుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత కనీసం పార్టీ గుమ్మం తొక్కేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఓడిపోయిన నాయకులు పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ దశలో పార్టీకి అండగా ప్రతి ఒక్కరు నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కించుకుని ఓటమి చెందిన నాయకులు ఎవరూ పార్టీకి అండగా నిలబడేందుకు ఇష్టపడకపోవడం, చాలామంది నాయకుల ఆచూకీ కనిపించకపోవడంతో టిడిపిలో ఆందోళన పెరుగుతోంది. 

 

IHG

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందింది. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఆ పార్టీ తరపు నుంచి గెలుపొందారు. అలా గెలుపొందిన వారిలో ముగ్గురు పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన 22 మంది అభ్యర్థుల ఆచూకీ ఇప్పుడు టిడిపిలో కనిపించడం లేదు. అసలు వారెవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించడం లేదు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్ తర్వాత కనిపించకుండా పోయారు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేసిన మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఓటమి తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 


అలాగే అరకు నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీకే పరిమితం అయ్యారు. అమలాపురం నుంచి పోటీ చేసిన గంటి హరీష్ మాధుర్ కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇక ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి బాబు ప్రస్తుతం పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం లేదు. నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందిన రాయపాటి సాంబశివరావు, నెల్లూరు ,కడప ఎంపీ అభ్యర్థులు ఆదినారాయణ రెడ్డి ఇలా ఓటమి చెందిన 22 మంది ఎంపీ అభ్యర్థులు పార్టీలో యాక్టివ్ గా కనిపించకపోవడంతో టిడిపిలోను ఆందోళన కలుగుతోంది. అసలు వీరు పార్టీలో ఉండాలనే ఉద్దేశంలో ఉన్నారా ? లేక శాశ్వతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసే ఆలోచనలో ఉన్నారా అనేది తెలియకుండా పోవడంతో అధినేత చంద్రబాబుకు సైతం అసహనం కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: