ఊహించని విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఎత్తు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 రెండు ర్రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని, సముద్రంలో కలిసే  వరదనీటిని మాత్రం వినియోగించుకోవడానికి ఈ జీవో తెచ్చామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

 

కానీ దీని వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం జగన్ తెచ్చిన జీవోపై ఫైర్ అయిపోతుంది. అటు తెలంగాణలోని ప్రతిపక్షాలు సైతం ఏపీ ప్రభుత్వం చర్యలని తప్పుబడుతోన్నాయి. అలాగే కేసీఆర్, జగన్ తో కుమ్మక్కయ్యి తెలంగాణ హక్కుల్ని కాలరాస్తున్నారని అంటున్నాయి.

 

ఇదే సమయంలో ఏపీలోప్రతిపక్షాలు మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్ధించడం లేదు. ఏదో ఒక బీజేపీ మాత్రమే జగన్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై ఎలాంటి స్పందన తెలియచేయలేదు. దీంతో రాయలసీమ ప్రయోజనాలు కోసం తెచ్చిన జీవో 203ని చంద్రబాబు సమర్ధిస్తున్నారా? లేదా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా? ఏపీ వారేనా? అంటూ నిలదీశారు.

 

ఇక దీనికి టీడీపీ నుంచి కౌంటర్ కూడా వచ్చేసింది. మొన్నటివరకు జగన్-కేసీఆర్ లది తండ్రీకొడుకుల బంధమని చెప్పిన విజయసాయి...ఇప్పుడు చంద్రబాబుని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటున్నారు. పైగా అన్ని సమస్యలు తొలగిపోయాయని డప్పు కొట్టుకున్నారని, కొత్త ప్రాజెక్టు కలిసి కడతామని చెప్పుకున్నారు. మరి అప్పుడు కేసీఆర్ చెప్పినట్లు నడుచుకున్న జగన్ రాయలసీమ బిడ్డో కాదో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. మరి కేసీఆర్ కు కోపం వస్తుందని వెనక్కి తగ్గుతారో, లేక మెడలు వంచి నీళ్లు సాధిస్తారో మీరే తేల్చుకోండి అని చెప్పారు. అంటే ఈ పోతిరెడ్డిపాడు విషయంలో టీడీపీ కలుగజేసుకోకుండా సైలెంట్ గా తప్పించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: