ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసుల ద్వారా వీరిని రాష్ట్రానికి రప్పించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి స్పందన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వారికి బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించనుంది. 
 
ప్రభుత్వం ప్రయాణికులు సొంత ఊళ్లకు చేరుకున్న తరువాత ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటానికి అంగీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు పంపారు. స్పందన పోర్టల్ ద్వారా ఏపీకి రావడానికి హైదరాబాద్ నుంచి 8,000 మంది, రంగారెడ్డి నుంచి 5000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న 13,000 మంది కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ప్రభుత్వం ప్రయాణికుల నుంచి ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ చార్జీలను వసూలు చేయనుంది. మియాపూర్‌-బొల్లారం క్రాన్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీనగర్ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో బస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయని సమాచారం. 
 
ప్రభుత్వం బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి వచ్చే వారి కోసం బస్సు సర్వీసులు నడపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం అత్యవసరం ఉన్నవారికి ఈ-పాస్‌లు జారీ చేయనుందని తెలుస్తోంది. ఎమర్జెన్సీ పనులు, కుటుంబంలో మరణం, అత్యవసర వైద్యం కోసం ప్రయాణించే వారికి డీజీపీ కార్యాలయం సీఎం ఆదేశాలతో పాస్ లను మంజూరు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఈ పాస్ ద్వారా సొంతూళ్లకు చేరుకున్నారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: