దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నెల చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనాను నియంత్రించగలమని భావిస్తున్నాయి. 
 
అయితే కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినా కరోనా ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ రియాన్ కరోనాను నియంత్రించలంటే ప్రపంచం పెద్ద కసరత్తే చేయాలని అన్నారు. హెచ్‌ఐవీ మాదిరిగా ఈ మహమ్మారి ప్రజలను వెంటాడే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుతం కరోనా పూర్తిగా అంతమవుతుందని ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. కరోనా వైరస్ ను నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ ను నియంత్రించాలంటే వాస్తవికంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఎప్పుడు అదృశ్యమవుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు. వ్యాక్సిన్ వస్తే కరోనాను కొంతమేర నియంత్రించవచ్చు కానీ పూర్తిస్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఈ వ్యాక్సిన్ లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు వ్యాక్సిన్ ల వల్ల కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. కరోనా భారీన పడి మృతి చెందిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరింది.            

మరింత సమాచారం తెలుసుకోండి: