సంప‌న్నుల‌కో న్యాయం.. పేద‌ల‌కో న్యాయ‌మా..? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు కాంగ్రెస్‌ త‌దిత‌ర పార్టీలతోపాటు సామాన్య జ‌న‌మూ ఈ ప్ర‌శ్న‌ల‌నే మోడీపై సంధిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కాలిన‌డ‌క‌న వంద‌ల కిలీమీట‌ర్లు న‌డుస్తూ స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై కొంద‌రు, ప్ర‌మాదాల్లో మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవ‌ల ఔరంగాబాద్‌లో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో ఏకంగా 16మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న దేశ ప్ర‌జ‌ల గుండెల్నిపిండేసింది.

 

బుధ‌వారం రాత్రి కూడా మ‌ధ్య‌ప్ర‌దేశ్ గునాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏకంగా 8మంది మృతి చెందారు. 50మంది గాయ‌ప‌డ్డారు. అలాగే.. అదే రాత్రి పంజాబ్ నుంచి న‌డుచుకుంటూ బిహార్‌కు కాలిన‌డ‌క‌న ప‌లువురు కార్మికులు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో వారిని బ‌స్సు ఢీకొట్ట‌డంతో న‌లుగురు ఆరుగురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఇలా నిత్యం ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. కార్మికుల త‌ర‌లింపున‌కు శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపుతోంది. కానీ.. కేంద్రం మాత్రం చార్జీల‌ను వ‌సూలు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో వందేభార‌త్ మిష‌న్ పేరుతో విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను విమానాల్లో తీసుకొస్తోంది.

 

ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాడీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. నిరుపేద‌లు, వ‌ల‌స కూలీల ప్రాణాలంటే కేంద్ర ప్ర‌భుత్వానికి ఎందుకంత చుల‌క‌న అని ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం ముజ‌ఫ‌ర్‌పూర్-ష‌హ‌రాన్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు వ‌ల‌స కూలీలు మృతిచెందిన ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేస్తూ అఖిలేష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. *విదేశాల్లో ఉన్న సంప‌న్నుల‌ను వందేభార‌త్ మిష‌న్ పేరుతో విమానాల ద్వారా భార‌త్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న నిరుపేద వ‌ల‌స‌కూలీలను మాత్రం రైలు చార్జీలు వ‌సూలు చేసి రైళ్ల‌లో త‌ర‌లిస్తున్నారు. చార్జీలు చెల్లించ‌లేని వారు కాలిన‌డ‌క‌న వెళ్తూ ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల రైలు ప్ర‌మాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బ‌స్సు ప్ర‌మాదంలో ఆరుగురు చ‌నిపోయారు. పేద కూలీల‌ను కూడా సురక్షితంగా స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌వ‌చ్చు క‌దా! పేద‌ల ప్రాణాలంటే ప్ర‌భుత్వాల‌కు ఎందుకంత చుల‌క‌న?*  అని అఖిలేష్ యాదవ్ ప్ర‌శ్నించారు.

 

కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రాన్ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించి, వ‌ల‌స కార్మికుల చార్జీల‌ను చెల్లించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు.. మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: