ఏపీలో అధికార వైసీపీకి ప్ర‌స్తుతం లోక్‌స‌భలో ఏకంగా 22 మంది ఎంపీలు ఉన్నారు. గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి ల‌భించిన అప్ర‌తిహ‌త విజ‌యంతో మూడు ఎంపీ సీట్లు మిన‌హా అన్ని చోట్లా వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ 22 మంది ఎంపీల్లో ఎక్కువ మంది తొలిసారి గెలిచిన వారే ఉన్నారు. వీరిలో ఉన్న‌త విద్యావంతులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక ఈ 22 మంది ఎంపీల్లో న‌లుగురు ఎంపీలు ఇప్పుడు పార్టీలో మంచి హాట్ టాపిక్ గా మారారు. వీరు న‌లుగురు మ‌హిళా ఎంపీలే కావ‌డం విశేషం. వీరు అమ‌లాపురం నుంచి విజ‌యం సాధించిన చింతా అనురాధ‌, అన‌కాప‌ల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కిన బీశెట్టి స‌త్య‌వ‌తి, కాకినాడ నుంచి గెలిచిన వంగా గీత‌, అర‌కు నుంచి విజ‌యం సాధించిన గొట్టేటి మాధ‌వి కి వైసీపీ అధినేత మంచి మార్కులు వేస్తున్నార‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది.

 

వీరిలో వంగా గీత మాత్ర‌మే గ‌తంలో రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ప‌నిచేశారు. మిగిలిన ముగ్గురు తొలిసారి లోక్‌స‌భ‌కు ఎంపికైన వారే కావ‌డం విశేషం. అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తి వృత్తిరీత్యా వైద్యురాలు. ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ లేకుండా ఆమె అంద‌రిని క‌లుపుకుని ముందుకు వెళుతున్నారు. త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏ ఎమ్మెల్యేతోనూ ఆమె ఎలాంటి గ్యాప్ లేదు. ఇక కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు. వాస్త‌వానికి ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తు ముగిసింది అనుకున్న టైంలో జ‌గ‌న్ చివ‌ర్లో పిలిచి ఆమెకు ఎంపీ సీటు ఇవ్వ‌డం.. ఆమె గెల‌వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఎక్క‌డా చిన్న వివాదం కూడా లేకుండా ఆమె ముందుకు వెళుతున్నారు.

 

ఇక అర‌కు లాంటి సంక్లిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పిన్న వ‌య‌స్కురాలు గొడ్డేటి మాధ‌వి తండ్రి నుంచి వ‌చ్చిన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని మ‌రీ ముందుకు వెళుతున్నారు. ప్ర‌జాసేవ‌లో మాత్రం కుటుంబాన్ని సైతం ప‌క్క‌న‌పెట్టి ముందుకు సాగుతున్నార‌న్న ప్ర‌శంస‌లు ఆమెకు ఉన్నాయి. ఇక అమ‌లాపురం నుంచి గెలిచిన చింతా అనూరాధ సైతం తొలిసారి వ‌చ్చి రావ‌డంతోనే ఎంపీ అయినా ముందుకు దూసుకు పోతున్నారు. ఏదేమైనా వైసీపీలో ఈ న‌లుగురు మ‌హిళా ఎంపీల ప‌నితీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: