రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల లోని అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నాయి.  ఇక తెలంగాణ బిజెపి నేతలు దీనిపై  దీక్షలకు  సైతం దిగారు. ఏపీ ప్రభుత్వం 203 జీవో తీసుకురావడం అన్యాయం అంటూ, తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.  దీనికి ఘాటుగానే  వైసిపి ఏపీ నాయకులు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారం వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి జీవో నెంబర్ 203 పై చంద్రబాబు స్పందన ఏంటో తెలియజేయాలి అంటూ డిమాండ్ చేశారు.  అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే చంద్రబాబు ఈ నెల 5వ తేదీన విడుదల చేసిన జీవో పై ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడడం లేదని, మీరు అసలు రాయలసీమ బిడ్డేనా  అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

IHG


 దీనిపై పై చంద్రబాబుకు ఇంటా బయటా ఒత్తిడి పెరిగిపోతుండడంతో ఎట్టకేలకు పార్టీ శ్రేణుల సమావేశంలో దీనిపై స్పందించారు.తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై టిడిపి నాయకులు ఎవరు తొందరపడి ప్రకటనలు చేయవద్దని, తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసే దీనిపై నాటకాలాడుతున్నారని, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అనుగుణంగా స్పందిద్దామని, తాను ప్రకటన చేసే వరకు దీనిపై ఎవరు దీనిపై తొందరపడి  స్పందించవద్దు అంటూ  పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

 

 మొత్తంగా ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.  ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉండడంతో ఏ ప్రకటన చేసినా ఆ ప్రభావం మరో రాష్ట్రంలో తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో బాబు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: