ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్‌కు మందును క‌నిపెట్టేందుకు అనేక దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇందులో భార‌త్ కూడా ముందు వ‌రుస‌లోనే ఉంది. అయితే.. వేల‌యేళ్లుగా మ‌న సంప్ర‌దాయ వైద్యంగా వ‌స్తున్న ఆయుర్వేదంలోనే క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది. తాజాగా.. కేంద్రం మంత్రి శ్రీ‌పాద్ వైనాయ‌క్ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆయుర్వేదంలోని నాలుగు ఫార్ములాల‌ను క‌రోనా వైర‌స్‌పై ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని... ఈ నాలుగు ఫార్ములాల‌తో ఈ వారంలోనే ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ‌, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కలిసి పనిచేస్తున్నాయని గురువారం ట్విట్టర్లో తెలిపారు. వారంలోనే ట్రయల్స్ కూడా ప్రారంభమవుతాయని ఆయ‌న‌ చెప్పారు. మ‌న ఆయుర్వేదం ప‌ట్ల త‌న‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంద‌ని, క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌న సంప్ర‌దాయ వైద్యం ఆయుర్వేదం ఓడిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అందులో పేర్కొన్నారు.

 

అంతేగాకుండా.. ఈ ట్ర‌య‌ల్స్ ఫ‌లితాలు కేవ‌లం మూడు నెల‌ల్లోనే వ‌స్తాయ‌ని  సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే, ఆయుర్వేద, ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా బుధవారం చెప్పిన విష‌యం తెలిసిందే. నిజానికి.. ఇలాంటి ప్ర‌య‌త్నం ఇదే మొద‌టిసార‌ని, గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని మంత్రి శ్రీ‌పాద్ తెలిపారు. నాలుగు ఫార్ములాల్లో అశ్వగంధ, యష్తిమధు (ములేతి), గుడుచి + పిప్పాలి (గిలోయ్), ఆయుష్ -64లు ఉన్నాయి. వీటితో ట్ర‌యల్స్ చేస్తున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. ఈ నాలుగు ఫార్మాలాలు క‌చ్చితంగా క‌రోనా వైర‌స్‌ను ఓడించితీరుతాయ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అశ్వ‌గంధ.. ఇందులో ఏది ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంద‌న్న విష‌యంపై కూడా అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు వారు చెబుతున్నారు. ఇక్క‌డే మరొక విష‌యం కూడా చెబుతున్నారు. చైనీస్ సంప్ర‌దాయ వైద్యంతో చైనీ అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించింద‌ని మాండే చెప్పారు. అలాగే.. మ‌న సంప్ర‌దాయ వైద్యం ఆయుర్వేద ట్ర‌య‌ల్స్ చేప‌ట్టేందుకు ఇది క‌రెక్ట్ స‌మ‌యమ‌ని ఆయ‌న చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: