కరోనా పోరుకు భారీగా నిధుల కేటాయించింది కేంద్రం. వెంటిలేటర్ల కొనుగోళ్లు, వలస కూలీల సంక్షేమం, కరోనా వ్యాక్సీన్ తయారీకి పీఎం కేర్‌ ఫండ్స్ నుంచి నిధులు అందించనుంది.

 

కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మోడీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం 3 వేల 100 కోట్లు విడుదల చేసింది. పీఎం కేర్ ట్రస్టు ఫండ్ నుంచి ఈ నిధులను కేటాయించారు. వీటిలో  2 వేల  కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు వెచ్చించనున్నారు. మరో  వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం వినియోగించనున్నారు.  100 కోట్లను కరోనా వ్యాక్సిన్ అభివ‌ృద్ధి కోసం కేటాయించారు.

 

2 వేల కోట్లతో సుమారు 5 వేల వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కొవిడ్ ఆస్పత్రులకు అందజేయనున్నారు. అటు వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు  వెయ్యి కోట్లు మంజూరు చేశారు. వారికి వసతి, భోజన సదుపాయాలు, వైద్య చికిత్స, రవాణా కోసం ఈ నిధులను వినియోగిస్తారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఈ నిధులను ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు.

 

కరోనా మహమ్మారితో పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసింది. దీనికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. వీటినుంచే తాజాగా మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలను విడుదలచేసింది కేంద్ర ప్రభుత్వం. రోజురోజుకూ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  75 వేలకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దాదాపు రెండున్నర వేల మంది మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో కేంద్రం వైరస్ పై చేసే యుద్ధంలో నిధుల లోటు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: