వారం రోజుల క్రితం విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 516 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది. 
 
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అస్వస్థతకు గురైన వారికి, ఐదు గ్రామాల ప్రజలకు పరిహారం అందజేసింది. అయితే తాజాగా ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. స్టైరేన్ గ్యాస్ లీక్ కావడంతో ఐదు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా బాధితుల్లో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కొంతమంది బాధితుల నోట్లో పుండ్లు వస్తున్నాయి. ఈ పుండ్ల వల్ల వారు ఆహారం తీసుకోలేకపోతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన వైద్య నిపుణులు వీరి ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నారు. బాధితుల్లో 15 నుంచి 20 మంది చర్మం కాలిపోయినట్టు తెలుస్తోంది. బాధితుల్లో మరికొందరు ఛాతిలో నొప్పి, వికారం, తలనొప్పి, కాళ్లు లాగడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. జగన్ సర్కార్ ఇప్పటికే వీరికి ప్రత్యేక హెల్త్ కార్డులను మంజూరు చేస్తామని ఆదేశాలు జారీ చేసింది. 
 
స్టైరేన్ కెమికల్ చాలా ప్రమాదకరం అని... ఈ గ్యాస్ పీల్చిన వారిలో ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిలో కొందరు డిశ్చార్జ్ కాగా మరికొందరు విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం, వైద్య బృందాలు బాధితులు త్వరగా కోలుకోవడానికి కృషి చేస్తున్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: