ప్ర‌పంచంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు త‌లెత్తినా త‌న వంతు సాయం అందించ‌డంలో భార‌త్ ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉంటుంది. ఇటీవ‌ల కరోనా వైర‌స్ కార‌ణంగా నెల‌కొన్న దారుణ‌మైన ప‌రిస్థితుల్లో త‌న‌ను తాను కాపాడుకుంటూనే.. అనేక దేశాలకు భార‌త్ సాయం అందించింది. మందుల రూపంలో, ధాన్య‌పు గింజ‌ల రూపంలో చేయూత‌నందించింది. అమెరికాతోపాటు అనేక దేశాల‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసెట‌మాల్ మాత్ర‌ల‌ను అందించి, ఆయా దేశాల్లో క‌రోనా చికిత్స‌కు సహ‌కారం అందించింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ దేశాలు భార‌త్‌పై ప్ర‌శంస‌లు కురిపించాయి. భార‌త్‌ను ప్రాణ స్నేహితుడిగా గుర్తిస్తున్నాయి.

 

ఇక తాజా విష‌యం ఏమిటంటే.. మ‌న ప‌క్క‌నే ఉన్న చిన్న‌దేశాలు భూటాన్‌, నేపాల్‌, టిబెట్ త‌దిత‌ర దేశాల‌కు అనేక మార్లు సాయం అందించింది. ప్ర‌స్తుతం భార‌త్ నుంచి భూటాన్‌కు రైలు మార్గం వేసేందుకు కూడా భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది. ఇరు దేశాల ప్ర‌భుత్వాలు ఈ మేర‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. స‌హ‌జ వ‌న‌రుల‌కు పెట్టింది పేరు భూటాన్‌. ప్ర‌ధానంగా మైనింగ్‌లో కింగ్ అనే చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి నుంచి మైనింగ్‌ను భార‌త్‌కు తీసుకురావ‌డానికి రోడ్డు మార్గం వేయాలంటే చాలా ఖ‌ర్చు, వ్య‌య‌ప్ర‌యాసాల‌తో కూడుకున్న విష‌యం. అలాగే.. విమానాలను ఉప‌యోగించ‌లేం. ఈ నేప‌థ్యంలో రైలు మార్గ‌మే మంచిద‌న్న ఆలోచకు వ‌చ్చిన భార‌త్ ఆ వైపుగా క‌స‌ర‌త్తు ప్రారరంభించింది. ఈ మేర‌కు రైల్వేశాఖ బృందం కూడా అక్క‌డికి వెళ్లి ప‌రిశీలించింది.

 

రైలు మార్గం ఏర్ప‌డితే ఇరుదేశాల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు, ఇత‌ర వ్యాపార సంబంధాలు పెంపొందించుకుని, కొత్త ఆర్థిక వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అటు భార‌త్‌, ఇటు భూటాన్ రెండు కూడా ఆర్థికంగా లాభ‌ప‌డే అవ‌కాశాలు మెండుగా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం రైలు మార్గం ఏర్పాటు దిశ‌గా చ‌క‌చ‌కా అడుగులు వేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: