ఏంటి మ‌న హైద‌రాబాద్‌కు...పాకిస్థాన్‌కు పోలికా?  పైగా...క‌రోనాపై పోరాటంలో! ఏంటండి బాబు ఈ చిత్రం అని అనుకుంటున్నారా? ఆశ్చ‌ర్య‌పోతున్నారా? విస్మ‌యం కూడా క‌లుగుతోందా?  మీ భావాల‌న్నీ వంద‌కు వంద శాతం క‌ర‌క్టే. కానీ...మేం చెప్పింది కూడా క‌రక్టే. ఉగ్ర‌వాదుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే పేరు పొందిన పాకిస్థాన్‌ క‌రోనాపై పోరాటంలో భాగం కానుంది. ఇదే పోరులో్ మ‌న హైద‌రాబాద్ కూడా జోడ‌యింది. ఒక్క హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు... ముంబై, నోయిడా కూడా క‌లుస్తున్నాయి. ఇన్ని ట్విస్టులు ఎందుకు...విష‌యం చెప్పండి అంటారా?!

 

ఈ ట్విస్టుల వివ‌రాల్లోకి వెళితే...గిలీడ్ సైన్సెస్ అనేది ప్ర‌ముఖ అమెరికా ఔష‌ధ సంస్థ‌. కొవిడ్‌-19 చికిత్సలో భాగంగా యాంటీవైరల్‌ ఔషధం ‘రెమ్డిసివిర్‌` కీలకంగా ఉపయోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెమ్డిసివిర్‌పై గిలీడ్‌ సైన్సెస్‌కు దాదాపు 70 దేశాల్లో 2,031 వరకు పేటెంట్లు ఉన్నాయి. గిలీడ్‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారానే ఇతర కంపెనీలు ఈ ఔషధాన్ని తయారుచేయడం సాధ్యమవుతుంది. కాబ‌ట్టి  ఈ ఔషధ తయారీ, పంపిణీ కోసం అమెరికా సంస్థ గిలీడ్‌ సైస్సెస్‌తో హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్ నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే ఇక ‌నుంచి ‘రెమ్డిసివిర్‌`‌  హైదరాబాద్‌లోనూ తయారు కానుంది.

 

 

అయితే, అస‌లు విష‌యం ఇక్క‌డే ఉంది. రెమ్డిసివిర్‌ ఉత్పత్తి, పంపిణీ కోసం హెటిరోతోపాటు మైలాన్‌ సంస్థతోనూ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, నోయిడాలోని జుబిలెంట్‌ లైఫ్ సైన్సెస్‌ సంస్థ కూడా గిలీడ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా నాలుగు దేశీయ ఫార్మా కంపెనీలతో గిలీడ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంటో పాటు పాకిస్థాన్‌కు చెందిన ఫిరోజ్‌సన్స్‌ ల్యాబొరేటరీస్‌ కూడా గిలీడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఎక్కువకాలం కొనసాగితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌, పాక్‌ భారీస్థాయిలో ఔషధాలను అందజేయగలుగుతాయట‌. అంటే, హైద‌రాబాద్‌తో పాటు దేశంలోని మ‌రో రెండు ముఖ్య‌మైన న‌గ‌రాలు... పాక్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో క్రియాశీల‌క పాత్ర పోషిస్తాయ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: