క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చుకునేందుకు, విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్శించి, ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించి, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించేందుకు కీల‌క‌ సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నాయి. ఈ దిశ‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, క‌ర్నాక‌ట‌, మ‌ధ్య‌ప్ర‌దేశ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప‌లు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయి. ఈ మేర‌కు సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నాయి. విదేశీ పెట్టుబ‌డిదారులు ఆయా రాష్ట్రాల్లో ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

 

ముఖ్యంగా రైతుల‌కు చెందిన‌ భూసేక‌ర‌ణ‌లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా.. కార్మిక సంఘాల నుంచి జోక్యం లేకుండా సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నాయి. ఇక క‌ర్నాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం అయితే మ‌రో అడుగు ముందుకేసి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కేవ‌లం 30రోజుల్లోనే భూసేక‌ర‌ణ చేప‌ట్టేలా నిర్ణ‌యం తీసుకుంది. అంతేగాకుండా.. ఈ రాష్ట్రాల్లో కార్మికుల ప‌నిగంట‌ల‌ను కూడా పెంచేస్తున్నాయి. అయితే.. ఇక్క‌డివ‌ర‌కు బాగానే ఉందిగానీ.. కీల‌క స‌మస్య‌లు త‌లెత్తే అవ‌కాశం కూడా ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు భూసేక‌ర‌ణే పెద్ద సమ‌స్య‌. త‌మ భూములు అప్ప‌గించేందుకు రైతులు ఎట్టిప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌ని, ఈ ప‌రిస్థితుల్లో బ‌ల‌వంతం చేస్తే.. అది ఉద్య‌మాల‌కు దారితీస్తుంద‌ని అంటున్నారు.

 

ఇదే స‌మ‌యంలో కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాసేలా తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా ఉద్య‌మాల‌కు దారితీస్తాయ‌మ‌ని చెబుతున్నారు. ప‌నిగంట‌లను పెంచ‌డం ద్వారా.. శ్ర‌మ‌దోపిడీకి గుర‌వుతార‌ని, దానిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణం అవుతాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల దూకుడుతో అది మ‌రింత తీవ్ర‌రూపం దాల్చుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: