తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన మంత్రివర్గం, అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేస్తూ.. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన కరోనా పూర్తిగా అరికట్టే ఆలోచనల దిశగా అడుగులు వేస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు సౌకర్యాల కోసం ఎలాంటి సడలింపులు చేయాలన్న వాటిపై అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా వైరస్ కట్టడి చేస్తూనే లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా సినిమాహాళ్లు,  రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థల కార్యకలాపాలనే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొనసాగించాలనే దానిపై నిర్దిష్ట విధానాలు సిద్ధం చేయాలని, దీనిపై ప్రణాళికను అందించాలని అధికారులను ఆదేశించారు.  టెలీ మెడిసిన్ విధానాన్ని మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్ సీకి ఒక బైక్ ఇవ్వాలని, జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో 290 క్లస్టర్లు ఉన్నాయని, ఇందులో 75 క్లస్టర్లలో ఇరవై ఎనిమిది రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

 

వాటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.  ఇక ఏపీలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాల వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపే ఆలోచన చేయాలని, వారికి ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.  రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు.. వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాలన్న విషయంపై అధికారులతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: