గత రెండు మూడు రోజులుగా ఏపీలో కరెంట్ బిల్లులపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మార్చి నెల కరెంట్ రీడింగ్ తీయకుండా, అంతకముందు నెల ఎంత బిల్ వచ్చిందో, అంతే బిల్ జనరేట్ చేసి, వినియోగదారులని ఆన్ లైన్ లో కట్టమన్నారు. ఇక తెలిసిన వారు ఆన్ లైన్ లో కట్టారు. మిగతా వారు అలాగే వదిలేసారు. అయితే తాజాగా ప్రభుత్వం ఏప్రిల్ బిల్ రీడింగ్ లని తీయడం మొదలుపెట్టింది.

 

ఈ క్రమంలోనే రెండు నెలల బిల్లు కలిపి ఒకేసారి పడి అధిక మొత్తంలో బిల్లు వస్తుంది. యూనిట్ల స్లాబులో మార్పులు ఉండటంతో, రెండు నెలలకు కలిపి ఎక్కువ యూనిట్లు రావడంతో, బిల్లులు కూడా అంతే రేంజ్ లో వస్తున్నాయి. ఇక ఆన్ లైన్ లో బిల్ కడితే, ఆ ఎమౌంట్ ని ప్రస్తుత బిల్ లో తగ్గిస్తున్నారు. అయితే ఇలా చేసినా వినియోగదారుడుకు నష్టమే ఉంటుంది. అసలు ఎలా అయినా గానీ, ఎప్పుడు రూ.500 బిల్ వచ్చేవారికి, ఇప్పుడు రెండు వేలపైనే బిల్ వస్తుంది. ఒకవేళ రెండు నెలలది కలిపినా అంత రాకూడదు.

 

ఇక ఇదే అంశంపై కొందరు ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసలే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇలా కరెంట్ చార్జీల భారం మోపుతారని ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై హోమ్ మంత్రి సుచరిత స్పందిస్తూ... పారదర్శకంగా బిల్లులు తీయడం జరుగుతుందని, మార్చి నెలలో గత సంవత్సరం టారిఫ్ ప్రకారం తీస్తున్నారని... ఏప్రిల్ నెల బిల్లులను డైనమిక్ విధానం ద్వారా తీస్తున్నారని చెప్పారు.

 

డైనమిక్ విధానం ప్రకారం ఎంత వరకు విద్యుత్‌ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని, డైనమిక్ విధానంతో ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు. అయితే మార్చి నెలలో అంతకముందు నెల అంటే ఫిబ్రవరిలో ఎంత వస్తే అంత బిల్ అని చెబితే కట్టామని, ఇప్పుడేమో గత సంవత్సరం టారిఫ్ అంటున్నారని, అసలు బిల్లులు ఇలా ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అని అడుగుతుంటే, మధ్యలో సామాన్యుడుకు అర్ధం కాని డైనమిక్, స్లాబులు గోల ఏంటి అని అడుగుతున్నారు. ఏదేమైనా విద్యుత్ బిల్లుల విషయంలో ప్రభుత్వానికి కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: