లాక్ డౌన్ వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడ నుంచి జూమ్ వీడియో యాప్ ద్వారా టీడీపీ నేతలకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తూ...జగన్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని జూమ్ యాప్ లోనే నిర్వహించారు.

 

ఇక ఇలా జూమ్ లోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.  టీడీపీ ఇప్పుడు జూమ్‌ పార్టీలా మారిందని, ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్‌ ద్వారా మెసేజ్‌లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో  ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం  చేయలేదని అన్నారు.

 

అయితే బొత్స వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ల దగ్గర నుంచి కౌంటర్లు బాగానే వస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఎక్కడివారు అక్కడే ఉండటం వల్లే తమ అధినేత జూమ్ యాప్ ద్వారా నేతలతో మాట్లాడుతూ..పార్టీని ముందుకు నడిపిస్తున్నారని, ఆ విషయం కూడా మంత్రికి అర్ధం కాలేదా? అంటూ మండిపడుతున్నారు. పోనీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కొత్త దారి ఉంటే చెప్పాలని అడుగుతున్నారు.

 

ఇక కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నారని, కానీ సాయం చేయనివ్వకుండా కొన్నిచోట్ల టీడీపీ నేతలపై కేసులు పెట్టారని చెబుతున్నారు. అదే వైసీపీ నేతలు ఎక్కడ తిరిగిన ఎలాంటి కేసులు ఉండవని, కానీ ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలని మాత్రం అడ్డుకుంటారని అంటున్నారు.  మొన్న చంద్రబాబు విశాఖ వెళ్తానని పర్మిషన్ అడిగితే ఎవరు ఆపారో కూడా తెలుసని చెబుతున్నారు. ఏవైనా విమర్శలు చేస్తే అర్ధవంతంగా ఉండాలి గానీ, అర్ధంపర్ధం లేకుండా ఉండకూడదని తమ్ముళ్లు ఫైర్ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: