కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ-2 పై టిఆరెస్  నాయకత్వం పెదవి విరుస్తోంది . కేంద్ర మంత్రి ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నదని  ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు .  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించిన ప్యాకేజీలు చాలా నిరుత్సాహ పర్చాయని  టీఆరెస్ సీనియర్ నాయకుడు , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు . బ్యాంకుల యాజమాన్యం తమ  సమస్యలతోనే  తాము సతమతమవుతుంటే ,  ఇక వాళ్ళు  ప్రజలకు ఏం సాయం చేస్తారని ఆయన  ప్రశ్నించారు .

 

కేంద్రమంత్రి ప్రకటించిన  ప్యాకేజీ-2  సఫలం అయ్యేలా ఏమాత్రం కన్పించడం  లేదన్న ఆయన , ప్రజలకు ప్యాకేజీ-2   ఏమాత్రం ఉపయోగకరం కాదన్నారు.  రానున్న 3-4 ఏళ్ల దాకా రెంటల్ అకామడేషన్ సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు . ప్యాకేజీ-2  లో భాగంగా  రానున్న మూడు, నాలుగేళ్లు రెంటల్ ఆకామడేషన్ కల్పిస్తామన్న కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై అప్పుడే ప్రజల్లో నీలినీడలు కమ్ముకుంటున్నాయని చెప్పారు . రెంటల్ ఆకామడేషన్ ఎలా కల్పిస్తారో స్పష్టత ఇవ్వలేదని వినోద్ కుమార్ అన్నారు .  నాబార్డు రీ ఫైనాన్స్ స్కీం లు కొత్త సీసాలో పాత సారా చందంగా ఉందన్నారు .  కాంపా నిధులు ఏ మేరకు సాయ పడతాయని ప్రశ్నించారు .

 

అడవుల పరిరక్షణ , మొక్కలు నాటేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు . ఆరువేల కోట్ల రూపాయలతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా రూపొందించిన ఈ పథకాన్ని రానున్న నెలరోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు . అయితే కాంపా పథకానికి కేంద్ర మంత్రి ప్రకటించిన నిధులు ఏమాత్రం సరిపోవని వినోద్ కుమార్ అన్నారు .  కేంద్ర  ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్లేయింగ్ టు గ్యాలరీ లాగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: