భార‌త‌దేశానికి చెందిన ఆర్థిక మేధావి, నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉపకరించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు పశ్చిమ బెంగాల్‌ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా వ్యవహరిస్తున్న అభిజిత్‌ బెనర్జీ... కరోనా కలకలం సమయంలో భార‌త్ వేసుకుంటున్న లెక్క‌లు అంత అనుకూలంగా లేవ‌ని విశ్లేషించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమించే అవకాశాలు ఉన్నప్పటికీ .. వీటితో భారత్‌కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమని ఆయ‌న తేల్చి చెప్పారు. తద్వారా భారత దేశంలోని వివిధ వర్గాల ఆశలపై నీళ్లు కుమ్మరించారు.

 

క‌రోనా కార‌ణంగా చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమిస్తే భారత్‌ లాభపడుతుందని కొందరు అంచనా వేస్తున్నప్ప‌టికీ అలా జరుగకపోవచ్చున‌ని అభిజిత్ బెన‌ర్జీ అంచ‌నా వేశారు. ``చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకొంటే ఆ దేశ ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయి. దీంతో ప్రజలు వాటి కొనుగోళ్లను కొనసాగిస్తారు’ అని బెనర్జీ విశ్లేషించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణమని చాలామంది నిందిస్తున్నారని అయితే, ఇది పెట్టుబ‌డుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నేది ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేమ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంపై నోబెల్ అవార్డు గ్ర‌హీత త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 

 

 


కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు జీడీపీలో ఒక్క శాతం కంటే తక్కువ మొత్తాన్ని ఖర్చుచేయనున్నట్టు మోదీ సర్కార్‌ ప్రకటించింది. ఇది ఏమాత్రం చాలదు. దీన్ని మరింత పెంచాల్సిన అవసరమున్నది’ అని బెనర్జీ స్పష్టం చేశారు. దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుకొనేందుకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అధిక మొత్తాన్ని ఖర్చుచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: