గత నాలుగు రోజుల నుంచి ఏపీలో విద్యుత్ బిల్లుల గురించి చాలా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో కరెంట్ బిల్లులు వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు ఎక్కువ మొత్తంలో రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వినియోగించిన విద్యుత్ కంటే ఒక్క యూనిట్ కు కూడా ఎక్కువ బిల్లు వేయలేదని చెబుతున్నా వినియోగదారుల్లో ఆందోళన తగ్గడం లేదు. 
 
అయితే చిత్తూరు జిల్లాలోని ఒక మహిళ నివశిస్తున్న గుడిసెకు ఏకంగా 41,149 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో షాక్ అవ్వడం మహిళ వంతయింది. ఛాన్వి అనే మహిళ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె ఇంటికి 41 వేల కరెంట్ బిల్లు రావడం మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు ఉన్న ఇంటికి 41 వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో మహిళ షాకైంది. 
 
కూలి పని చేసి కుటుంబాన్ని పోషించుకునే తాను అంత మొత్తం బిల్లు ఎలా చెల్లించగలనని ఛాన్వి ఆవేదన వ్యక్తం చేస్తోంది. రెండు నెలల కరెంట్ బిల్లు 41 వేల రూపాయలు రావడంతో స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామానికి పరిసర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో పూరి గుడిసెలో ఉండే కుటుంబానికి 17,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. 
 
మరో ఏరియాలో రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్న కుటుంబానికి 28,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ప్రతి సంవత్సరం వేసవిలో వందల్లో వచ్చే బిల్లులు వేలల్లో రావడంతో ఏం చేయాలో అర్థం కాక బాధితులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు మాత్రం వినియోగించిన దానికే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కరెంట్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: