తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంచాయ‌తీ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు అదనంగా మూడు టీఎంసీల కృష్ణాజలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టనున్న కొత్త ప్రాజెక్టు విషయంలో నెలకొన్న వివాదాం విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య పొరాపొచ్చాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంట‌నే ఉత్కంఠ నెల‌కొన్న త‌రుణంలో కృష్ణాబోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అపెక్స్‌ కౌన్సిల్‌ వేదికగా పరిష్కరించాలని కృష్ణాబోర్డు భావిస్తున్నట్లు స‌మాచారం. 

 


ఏపీ ప్రభుత్వం చేప‌ట్టే కొత్త ప్రాజెక్టు నిర్మాణంపై విధానాలు వెలువ‌డిన అనంత‌రం తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలోనే ఆయన.. ఏపీ కొత్త ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదుచేయాలని, న్యాయపోరాటం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో  ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ బుధవారం నేరుగా కృష్ణా బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నదని తెలిపారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని స్పష్టం చేశారు.

 

 

తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించిన నేప‌థ్యంలో కృష్ణాబోర్డు యంత్రాంగం అప్రమత్తమైందని స‌మాచారం. గతంలో బోర్డు అడిగిన వివరణకు ఏపీ ప్రభుత్వం స్పందించని దరిమిలా.. తాము ఇంకా ఉపేక్షిస్తే పరిస్థితి మరింత సీరియస్‌ అయ్యే అవకాశాలున్నాయని బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో అపెక్స్‌ కౌన్సిల్‌లో సమావేశం ఏర్పరిస్తే సమస్యకు పరిష్కారం లభించవచ్చని బోర్డు అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు బోర్డు తరఫున వాస్తవాలను వివరించి, తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదును కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లి.. అక్కడినుంచి చర్యలు మొదలుపెట్టాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: