పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధ‌ర కావాలంటే  ప్రభుత్వం సూచించిన పంట‌లే సాగు చేయాలంటోంది. ఈ వర్షాకాలం వ‌రి సాగు నుంచే  కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలంటోంది. చెప్పిన పంట‌లు వేయ‌కుంటే క‌ఠిన నిర్ణయాలు త‌ప్పవంటున్న ముఖ్యమంత్రి... ఈ రోజు  నేరుగా క్షేత్రస్థాయి అధికారుల‌తో మాట్లాడ‌నున్నారు.

 

పంట మార్పిడి, క్రాప్ కాల‌నీల ఏర్పాటుపై ఇప్పటికే చాలాసార్లు సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వహించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంట‌ల ఉచిత విద్యుత్ ప‌థ‌కాల‌తో పంట సాగు బాగా పెరిగింద‌ని అంచ‌నావేశారు. ఈసారి రాష్ట్రంలో 50 ల‌క్షల ఎక‌రాల్లో వ‌రి సాగు చేయాల‌ని నిర్ణయించారు. ఇందులో ప‌ది ల‌క్షల ఎక‌రాల్లో సోనా వ‌రి ర‌కం వేయాల‌ని భావిస్తున్నారు.  అలాగే ఈ వ‌ర్షాకాలంలో 50 ల‌క్షల ఎక‌రాల్లో ప‌త్తి, ప‌ది ల‌క్షల ఎక‌రాల్లో కందులు పండించాలని ప్రణాళిక‌లు సిద్ధం చేశారు.నియంత్రిత ప‌ద్దతిలో  పంట‌ల‌సాగును... ఈ వ‌ర్షాకాలం నుంచే సాగు చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సూచించిన పంట‌లు సాగు విధానాన్ని .. ఈ వానాకాలం నుంచే మొద‌లుపెట్టాల‌ని రైతులకు స్పష్టం చేసింది.

 

పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఒకే ర‌క‌మైన పంట‌లు వేయ‌డ‌మే అంటున్నారు సియం. ఏది ప‌డితే అది పండించి మార్కెట్‌కు తీసుకొస్తే... కొనేవారు  ఉండ‌రన్నది సీఎం భావన.డిమాండ్ ఉన్న పంట‌లే సాగు చేయాలి, అప్పుడే మ‌ద్దతు ధ‌ర వ‌స్తుంద‌ంటున్నారు.  కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ ఏర్పాటు చేసి అవ‌స‌రం అయిన‌ పంట‌ల విత్తనాలు మాత్రమే అమ్మేలా చ‌ర్యలు తీసుకోనున్నారు. విత్తన చ‌ట్టంలో మార్పులు  తెస్తామంటున్న సీఎం.. త్వర‌లో సీడ్ కంపెనీల ప్రతినిధుల‌తో స‌మావేశం కానున్నారు. 

 

న‌కిలి, క‌ల్తీ విత్తనాలు అమ్మే వ్యాపారులు, దళారులపై ... ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. న‌కిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు  పెట్టనున్నారు. మరోవైపు..వ్యవ‌సాయ శాఖ‌ను పున‌ర్ వ్యవ‌స్తీకరించి  రైతు బంధు స‌మితుల‌ను క్రియా శీల‌కం చేయ‌నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: