హైదరాబాద్ పై కరోనా వైరస్ పగబట్టిందా.. కొద్దిరోజుల వరకూ అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కేవలం మూడు రోజుల్లోనే 142 కేసులు ఎలా నమోదయ్యాయనే ఆందోళన నెలకొంది. 

 

హైదరాబాద్‌లో వైరస్ మహమ్మారి తన ప్రతాపమేంటో చూపిస్తోంది.  కొద్దిరోజుల క్రితం వరకూ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ అదుపులోకి వస్తోందని ప్రభుత్వం భావించింది. అయితే తగ్గినట్లే తగ్గి, మళ్లీ రాకాసి వైరస్ విజృంభిస్తోంది. 

 

ఆరంభంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేశారు. రానురానూ సడలింపు ఇచ్చేశారు. తర్వాత జనం రోడ్లపైకి రావడం మొదలెట్టారు. చిన్నచిన్న కారణాలతో బయటికి వస్తున్న వారికి పోలీసులు  కౌన్సెలింగ్ ఇస్తున్నా చెవికెక్కడం లేదు. 

 

వనస్థలిపురం, ఎల్బీనగర్ సహా పలుప్రాంతాలు.. కరోనా భయంతో వణికిపోతున్నాయి. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధిక కంటైన్మెంట్లు ఉన్నాయి. 150 వరకూ స్పెషల్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోనుకు ఒక డీఎంహెచ్‌ఓ, రెవెన్యూ జీహెచ్‌ఎంసీ అధికారులను నియమించారు. రెడ్ జోన్లను కట్టడి చేసి, అక్కడి నుంచి రాకపోకలు నియంత్రించారు. ఆయా జోన్లలో అధికారులే .. నిత్యవసరాల పంపిణీకి ఏర్పాటు సైతం చేశారు. రోజూ పారిశుధ్య కార్మికులు.. వీధులను హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేశారు. దీంతో కేసులు తగ్గినట్లు కనిపించాయి. కానీ ఒక్కసారిగా రాకాసి విరుచుకుపడింది. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి.

 

హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండడంపై కేంద్రం దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా 20 నగరాలకు ప్రత్యేక బృందాలను పంపగా.. అందులో హైదరాబాద్ ఉంది. ఎనిమిది రోజుల పాటు అధ్యయనం చేసిన బృందం.. కేంద్రానికి నివేదిక ఇచ్చింది. సిటీలో కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందా? అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్రం, రాష్ట్రం కూడా లోతుగా పరిశీలిస్తున్నాయి.

 

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవలే పలు షాపులు తెరిచేందుకు .. కేంద్రం అనుమతులిచ్చింది. దీంతో వైన్స్ సహా పలుషాపులు తెరిచారు. దుకాణదారులు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి గైడ్ లైన్స్ సైతం జారీ చేశారు. లిక్కర్ షాపులు తెరిచిన తర్వాత కేసులు అధికసంఖ్యలో నమోదవుతుండడంతో... ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. అన్నీ మూసినప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రేపు లాక్ డౌన్ ఎత్తేస్తే ఎలా ఉంటుందన్న భయం అధికారులను వెంటాడుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: