వైద్య స‌దుపాయాలు త‌క్కువ‌గా ఉండి.. జ‌నాభా ఎక్కువ‌గా ఉండే భారతదేశంలో లాక్‌డౌన్ స‌డ‌లింపులతో క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, ప‌రిస్థితులు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతాయ‌ని ప‌లుమార్లు నిపుణులు హెచ్చ‌రించారు. ఇప్పుడు వీరు చెప్పిందే నిజ‌మ‌వుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు అతి త‌క్కువ‌గా చేస్తున్న దేశాల్లో భార‌త్ ఒక‌టిగా నిలుస్తోంది. లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంర‌గా మారుతోంది. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని త‌బ్లిఘి జ‌మాత్‌కు ముందు ఆ త‌ర్వాత‌గా చూశాం.. ఇప్పుడు వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపున‌కు ముందు..ఆ త‌ర్వాత‌గా చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఇక‌  మొన్నటి వరకు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపిన ప్రాణాంతక కరోనా.. భారత్‌లోనూ అదే స్పీడ్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 81,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2649 మంది మృత్యువాత పడ్డారు.

 

ఇదే క్రమంలో కరోనా వైరస్‌ పురుడుపోసుకున్న చైనాను భారత్‌ అధిగమిస్తోందంటే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. చైనాలో ఇప్పటి వరకు 82,933 కరోనా కేసులు నమోదు కాగా.. 4633 మంది మరణించారు. అయితే చైనాతో పోల్చుకుంటే భారత్‌లో కాస్తా మరణాల రేటు తక్కువగా ఉంది. ఇదొక్క‌టే మ‌నం ఊపిరిపీల్చుకునే అంశం.  భారత్‌లో గడిచిన నెలరోజుల్లో ప్రతి రోజూ కనీసం మూడువేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రేపో మాపో భారత్‌ చైనాను అధిగమిస్తుంది.. అందులో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. ఇదిలా ఉండ‌గా.. ఇక్క‌డ మ‌రొక వాద‌న వినిపిస్తోంది. అయితే కరోనా కేసులను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం దాస్తోందంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు మొద‌టి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఇక వైరస్‌కు జన్మస్థలమైన వుహాన్‌ నగరంలోనూ పెద్ద ఎత్తున మరణాలు నమోదు అయినప్పటికీ చైనా ప్రభుత్వం వాటిని బయటకు రానీయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే చైనాలో కరోనా కేసులు లక్షకు పైనే నమోదై ఉంటాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటనీ చైనా ఖండించింది. మరోవైపు వైరస్‌ బారిపడ్డ మొత్తం 80వేలకు పైగా బాధితులు పూర్తిగా కోలుకున్నారని చైనా చెబుతోంది. అయితే చైనీయులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంతో వైరస్‌ను కట్టడి చేయ‌గ‌లిగామ‌ని అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: