ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిరోజులుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరి అంచనాలకు అందకుండా ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జాసంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు అధికార యంత్రాంగం గుండెళ్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నారు. పాల‌నా ప‌ర‌మైన విష‌యాల్లో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  మొన్నటికి మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మ‌క‌గ‌డ్డ‌ రమేష్ కుమార్‌ను తొలగించిన జ‌గ‌న్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఇంకా తొల‌గింపున సంబంధించి వివాదం కొన‌సాగుతూనే ఉంది.

 

ప్ర‌ధానంగా రాష్ట్ర ప్ర‌భుత్వ పాల‌న‌ను గౌర‌వించ‌కుండా.. బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారంద‌రినీ ఒక్కొక్క‌రిగా ఏరిపారేస్తున్నారు. ఇప్పుడు ఏపీకి అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును రాష్ట్ర‌‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం నెలకు రూ. 2 లక్షల వేతనంతో  హెచ్‌కే సాహును ఏప్రిల్‌ 14, 2018న కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు.

 

 ఈ నేప‌థ్యంలో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇక ఈ నేప‌థ్యంలో మ‌రికొంద‌రిలోనూ వ‌ణుకుమొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ముందుముందు మ‌రికొంద‌రు కూడా ఔట్ కావ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చాలా క్లారిటీగా ఉన్నార‌ని, ఆ జాబితా మొత్తం ఆయ‌న వ‌ద్ద ఉంద‌ని సంద‌ర్భాన్ని బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: