తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లా ప్ర‌భుత్వానికి, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. ఊహించ‌ని విధంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా సీరియ‌స్‌గా తీసుకుని అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఏకంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, జిల్లా వైద్యారోగ్య అధికారిపై బ‌దిలీ వేటు వేశారు. ఇత‌ర అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ త‌దిత‌ర ఉన్నతాధికారులు సూర్యాపేట‌లో ప‌ర్య‌టించారు. ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ చ‌ర్య‌ల‌ ఫ‌లితంగా ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఈ నేప‌థ్యంలో రెడ్ జోన్‌లో ఉన్న సూర్యాపేట కరోనా ఫ్రీ జిల్లాల జాబితాలోకి చేరింది. 83 పాజిటీవ్ కేసులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన సూర్యాపేట ప్రస్తుతం కరోనా ప్రీ జిల్లాగా మారడంతో అధికారులు, ప్ర‌జ‌లు హర్షం వ్యక్తం చేశారు.

 

గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన 83 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. సూర్యపేట కూరగాయ మార్కెట్‌లో 52 కేసులు నమోదుకాగా.. ఆత్మకూరు, నాగారం మండలం, వర్ధమానకోట, అనంతరాం, నేరేడుచర్ల, తిరుమలగిరి, మధిర మండలం తదితర గ్రామాల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి... ఉన్నతస్థాయి బృందాన్ని జిల్లాకు పంపడం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. కాగా, త‌బ్లిఘి జ‌మాత్‌కు వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తితో వైర‌స్ వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే. ఇక కేసీఆర్ దృష్టి అంతా హైద‌రాబాద్‌పైనే ఉంది. ఇక్క‌డే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలో కొత్త కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

 

మొదట్లో ఎన్నారై... మర్కజ్‌ మూలాలు ఉన్న కుటుంబాల్లోనే వైరస్‌ వెలుగు చూసినప్పటికీ... తాజాగా ఏ మూలాలు లేని వ్యక్తులకు క‌రోనా వైరస్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా గ్రేటర్‌ పరిధిలో గురువారం 40 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఎల్‌బీనగర్‌ పరిధిలోని చైతన్యపురి, కొత్తపేట, ఆర్కేపురం కాలనీలకు చెందిన ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మీర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లెలగూడ న్యూవివేక్‌నగర్‌లో ఉండే జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలి ద్వారా మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ప‌క‌డ్బందీ వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: