మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు టీడీపీ ప్రజా ప్రతినిధులతో, ముఖ్యనేతలతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు లాక్ డౌన్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయారని... ప్రభుత్వమే ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని...వైసీపీ సామాన్య ప్రజలపై కరెంట్ బిల్లుల రూపంలో భారం మోపడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి పలు రాయితీలు ప్రకటించిందని... రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపై భారం పడకుండా ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లు మొత్తాన్నే ప్రతినెలా కట్టించుకోవాలని అన్నారు. 
 
పోలీసులు ప్రజల వాహనాలను స్వాధీనం చేసుకున్నారని... ఆ వాహనాలు పాడయ్యే అవకాశం ఉన్నందువల్ల వాటిని వాహనదారులకు తిరిగి ఇచ్చేయాలని... వాహనాలపై పెట్టిన కేసులు వెంటనే రద్దు చేసేలా చేయాలని నాయకులతో చెప్పారు. జగన్ సర్కార్ ప్రజల ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోందని... కరోనా సంక్షోభం వల్ల భూముల ధరలు పడిపోయిన సమయంలో ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరుతో సోల్డ్ ఏపీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. 
 
ప్రభుత్వం బిల్డ్ ఏపీ కార్యక్రమాన్ని నిలిపివేసేలా కృషి చేద్దామని నాయకులకు సూచించారు. వలస కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ప్రభుత్వం తక్షణమే స్పందించి వలస కార్మికులను ఆదుకునేలా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పోరాడాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ మాఫియా దుర్మార్గాలను అరికట్టాలని అన్నారు. 
 
లాక్ డౌన్ లోనూ వైసీపీ నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అక్రమ రవాణా విచ్చలవిడిగా చేస్తున్నారని అన్నారు. శాండ్ మాఫియా అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల వైసీపీ నేతలే అక్రమంగా మద్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. తక్కువ ధరలకు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి మన రాష్ట్రంలో రెట్టింపు ధరలకు అమ్మి సామాన్యుల జేబులు గుల్లచేస్తున్నారని నాయకులకు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: