ఏపీకి రోజులు బాగాలేవా. కాలం కూడా కలసిరావడంలేదా. ఇంకా చెప్పాలంటే వాస్తు కాస్తా చిన్న చూపు చూస్తోందా. అంటే ఇపుడు చెప్పుకున్నవన్నీ కూడా కరెక్టేనని అంటారంతా. ఎందుకంటే పాలకుండ లాంటి ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు కావడంతోనే ఏపీకి ఎక్కడలేని  కష్టాలు వచ్చిపడ్డాయి. ఆరేళ్ల కాలంలో ఏపీ ఏ మాత్రం ఎత్తిగిల్లలేదు కానీ అప్పుల కుప్ప మాత్రం అయింది.

 

చంద్రబాబు ప్రపంచ రాజధాని అంటూ ఆ భ్రమలలో పడి చేసిన అప్పులు, తిరిగిన టూర్లతో  అయిదేళ్ళు గడిచేసరికి అన్ని విధాలుగా అప్పులతో కునారిల్లింది. ఏపీకి అక్షరాలా రెండున్నర లక్షల కోట్ల అప్పు బాబు పెట్టిపోయారని వైసీపీ నేతలు లెక్కలు తేల్చారు. బాబు కుర్చీ దిగిపోయేనాటికి కేవలం వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయని అంటే ఆశ్చర్యపోవాల్సిందేగా.

 

ఇపుడు జగన్ వంతు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. జగన్ మోజు సంక్షేమ కార్యక్రమాలు. వాటి కోసం ఆయన ఎంతదాకానైనా వెళ్తున్నారు. అప్పులు చేసైనా ప్రజలకు పధకాలు పంచిపెట్టాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ ఏడాదిలోనే జగన్ సర్కార్ చేసిన అప్పు ఎనభై వేల కోట్ల రూపాయలు అని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ పాలనలో కొత్త రూపాయి పుట్టలేదని, అప్పులు మాత్రం బాగా చేశారని అంటున్నారు.

 

ఓ విధంగా చూస్తే జగన్ ఇపుడు ప్రభుత్వ భూములు అమ్మడం కూడా ఖజానాను నింపుకోవడానికేనని తెలిసిందే. ఎవరైనా ఉన్న ఆస్తిని అమ్ముకునే దాకా వస్తే వారిని బాగుపడ్డారు అని ఏమీ అనరు. చెడిపోయారనే అంటారు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అప్పులు ఉన్నా ఇలా ఏకంగా భూములు అమ్ముకునేటంతగా లేవు. ఇక అప్పులు తేవడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు.

 

 ఆ తెచ్చిన అప్పులతో నిర్మాణాత్మకమైన పధకాలకు ఖర్చు చేస్తున్నారా లేదా అన్నదే చూస్తారు. ఆ విధంగా చూసినపుడు నాడు బాబు నేడు జగన్ ఇద్దరూ కూడా తమ సొంత రాజకీయ అజెండాలను పూర్తి చేసుకోవడానికే అప్పు చేస్తున్నారని అంటారు.అయిదేళ్లలో బాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక ఏడాదిలో జగన్ ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే అయిదేళ్ళు పూర్తి అయ్యేనాటికి జగన్ బాబుని మించి కొత్త రికార్డు స్రుష్టిస్తారా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: