అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం కూడా ఈ రెండు పార్టీల మధ్య వార్ గట్టిగానే జరుగుతుంది. కరోనా, విశాఖ గ్యాస్ లీక్, కరెంట్ బిల్లులు, మద్యం ధరలు ఇలా తాజా అంశాలపై మాటల యుద్ధం జరుగుతుంది.

 

ఈ క్రమంలోనే వీరి మధ్య పోలవరం అంశం విమర్శలకు దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, గత ప్రభుత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తుందని,. తాము 70 శాతం పూర్తి చేసినా సరే ఇప్పుడు ఒక్క ఇటుక వేయలేదని విమర్శలు చేస్తున్నారు.

 

దీంతో ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. 70శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్న ఉమ.. దానిని నిరూపిస్తే తన మీసం తీసేసి తిరుగుతానని మంత్రి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే ఆయన మీసం తీసి తిరుగుతారా? అని ప్రశ్నించారు.

 

అలాగే వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ హయాంలో పూర్తైందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని, రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఒకవేళ సీమకు  న్యాయం చేసి ఉంటే ప్రజలు పది సీట్లు అయినా ఇచ్చేవాళ్లని మాట్లాడారు. అయితే మంత్రి విసిరిన సవాల్ విషయానికొస్తే...పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తయిందన్న దానిలో వాస్తవం లేదని తెలుస్తోంది.

 

కాకపోతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగిన విషయం వాస్తవమని, కానీ 70 శాతం పూర్తి కాలేదని, 50-60 శాతం మధ్యలోనే ఉంటుందని విశ్లేషుకులు అంటున్నారు. కాబట్టి ఈ మీసం తీసే సవాల్ లో మంత్రి అనిల్ కుమార్‌దే గెలుపని అర్ధమవుతుంది. ఇంకా తర్వాత ఏంటనేది ఉమా చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: