క‌రోనా వైర‌స్ వ్యాప్త నిరోధానికి దేశవ్యాప్తంగా మూడో విడుత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 ఎలా ఉండ‌బోతుంద‌న్న‌దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. లాక్‌డౌన్‌ 4.0లో ఎక్కువ సడలింపులు, సౌకర్యాలు ఉంటాయని కేంద్ర‌ ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.  గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆరెంజ్‌ జోన్‌లో పరిమితస్థాయిలో ఆంక్షలు ఉంటాయని, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రమే కఠిన నిబంధనలు ఉండనున్నాయట‌. నిజానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ 4.0 పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి శుక్రవారంలోగా అభిప్రాయాలు తెలుపాలని రాష్ర్టాలను కోరారు. అయితే.. తెలంగాణ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, అసోం రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే జోన్లను నిర్ణయించే అధికారం రాష్ర్టాలకు అప్పగించాలని కోరినట్లు ఆ అధికారి చెప్పారు. అయితే.. దీనికి కేంద్రం ఓకే చెప్పే అవకాశం ఉన్నదన్నారు.

 

దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ సెలూన్లు, బార్బర్‌ షాప్‌లు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు. రాష్ర్టాల సిఫారసులను పరిశీలించిన తరువాతనే తుది మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు తెలిపారు. రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌తోపాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు కూడా రైలు, విమాన సేవలను వ్యతిరేకించాయని తెలిపారు. దేశంలో కంటైన్మెంట్‌జోన్లు మినహా మిగతా ప్రాంతా ల్లో పరిమిత స్థాయిలో లోకల్‌ రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు నడవొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. పలు ఆంక్షలతో రెడ్‌జోన్లలోనూ ఆటో, ట్యాక్సీలను అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారం రాష్ర్టాలకే అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: