చైనాపై అమెరికాకు ఎక్కడ లేని కోపం వస్తోంది. కరోనాకు అసలు కారణం డ్రాగన్ దేశం అని పళ్లుకొరుకుతోంది. యుద్ధానికి కాలుదువ్వుతోంది. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న వైరస్ కు పుట్టినిల్లయిన చైనాకు గట్టిగా పనిష్ మెంట్ ఇవ్వాలని అమెరికన్ సెనేటర్లు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధమవుతోంది. అందుకు ఇండియా సహకారం తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే మన దేశ సైన్యాన్ని బలోపేతం చేసి చైనాపై కసి తీర్చుకోవాలని చూస్తోంది అగ్రదేశం. 

 

చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది అమెరికా. కరోనా వైరస్ తమ దేశంలో పురుడుపోసుకున్నప్పుడు ప్రపంచ దేశాలను హెచ్చరించకుండా ఉండటంపై మండిపడుతోంది. కావాలనే ఇంతటి ఉపద్రవానికి పూనుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు. ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశం నుంచి నష్టపరిహారం వసూలు చేస్తాయంటున్నారు.  ఓ సెనేటర్ 18 అంశాలతో యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. దీని ప్రకారం చైనా చుట్టుపక్కల దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుని.. డ్రాగన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని వ్యూహం సిద్ధమైంది. 

 

భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉండటం ఆసక్తి రేపుతోంది. పసిఫిక్ డిటెరెన్స్ ఇనిషియేటివ్ పేరుతో 20 బిలియన్ డాలర్ల నిధుల సైనిక విభాగం ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సూచిస్తోంది. ఇండియా, తైవాన్, వియత్నాం లాంటి దేశాలకు విస్తృతంగా ఆయుధాలు విక్రయించాలని భావిస్తోంది. జపాన్ సైనిక పునర్నిర్మాణంతో పాటు ఆయుధాలు విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. దక్షిణ కొరియాకు కూడా ఆయుధాలు విక్రయించే ఆలోచనలో ఉంది. 

 

చైనాలో కేంద్రీకృతమైన అమెరికా తయారీ రంగాన్ని స్వదేశానికి రప్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరఫరా గొలుసు విషయంలో చైనాపై ఆధారపడటం తగ్గించుకోకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే చైనా సంస్థ హువావేపై విధించిన నిషేధం అమలు చేయడంతో పాటు.. మిత్రపక్షాలు కూడా అదే బాటలో నడిచేలా చేయాలని ప్లాన్ చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ చైనాపై ఆంక్షలు విధించేలా చూడాలని అమెరికా వ్యూహరచన చేస్తోంది. 

 

2022 వింటర్ ఒలింపిక్స్ వేదిక బీజింగ్ నుంచి మార్చేలా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తేవాలని అమెరికా కోరనుంది. అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని కూడా నిషేధించాలని, వాటిని దుష్ప్రచార సంస్థలుగా గుర్తించాలని భావిస్తోంది. చైనా సప్లై చైన్ కారణంగా జరిగిన నష్టం, ప్రజాభద్రతకు పొంచి ఉన్న ముప్పుపై లోతైన విచారణ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: