ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. భారత్ సహా ఇతర దేశాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల విదేశాల్లో లక్షల సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. 
 
కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా పలు దేశాల నుంచి భారతీయులను మన దేశానికి రప్పించింది. కరోనా మహమ్మారి విజృంభణతో విమాన ప్రయాణాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. గతంలో విమాన ప్రయాణాలకు, ప్రస్తుత విమాన ప్రయాణాలకు నియమనిబంధనలు మారాయి. మరి వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల నుంచి భారత్ కు వచ్చిన భారతీయులు తమ అనుభవాలను పంచుకున్నారు. 
 
ఎన్నోసార్లు విమానాల్లో ప్రయాణించిన వాళ్లు వాళ్ల అనుభవాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. లండన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికురాలు గతంలో ప్రయాణం రొటీన్ గా ఉండేదని... గతంలో విమానాల్లో వేడి వేడి ఆహారం అందేదని ప్రస్తుతం ప్యాకింగ్ మీల్స్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. గతంలో వాష్ రూమ్ కు పరిమితులు ఉండేవని... ప్రస్తుతం అలాంటివేం లేవని అన్నారు. 
 
వందే భారత్ మిషన్ లో భాగంగా ఎవరైనా ప్రయాణం చేయాల్సి వస్తే నా అనుభవాలు పనికివస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు విమానంలో ఎక్కే సమయంలో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించారని... రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేశారని, గుండె కొట్టుకునే వేగాన్ని పరిశీలించారని, కరోనా లక్షణాలు లేని వారికి స్టాంప్ వేసి క్వారంటైన్ కేంద్రానికి తరలించారని అన్నారు. 
 
కేవలం 7 కేజీల లగేజీకి అనుమతిస్తున్నారని... బోర్డింగ్ కు ముందే లగేజ్ పై కెమికల్ స్ప్రే చేస్తున్నారని... క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేవారికి శాండ్ విచ్ లు, వాటర్ ఇస్తున్నారని చెప్పారు. విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉంటుందని ఆ నిబంధనకు అనుమతిస్తేనే విమానంలో ప్రయాణించాలని సూచించారని అనుభవాలను పంచుకున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: