ఎప్పుడు ఏదొకరకంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న ప్రతిపక్ష టీడీపీ..తాజాగా తూర్పు గోదావరిలో భారీ భూ కుంభకోణం జరిగిందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని ఆవ భూములని లబ్దిదారుల కోసం ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఆ భూములని కొని, చదును కూడా చేసింది.

 

అయితే ఈ భూసేకరణలో వైసీపీ నేతలు పెద్ద దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భూసేకరణ విషయంలో నిజనిజాలు తేల్చడానికి టీడీపీ బృందం ఒకటి ఏర్పాటైంది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు చినరాజప్ప, గోరంట్ల, నిమ్మల రామానాయుడు, సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర పార్టీ నేతలున్నారు.

 

ఇక పేదల ఇళ్ల  స్థలాల కోసం చేసిన భూసేకరణలో నాలుగు వందల కోట్ల  రూపాయలు  దోపిడీ జరిగిందని టీడీపీ బృందం ఆరోపించింది. వరద ముంపునకు గురయ్యే భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని, ఎకరం ఏడు లక్షల రూపాయలు కూడా విలువ చేయని భూములకు 45 లక్షల వరకూ ఇచ్చి దోపిడి చేశారన్నారు. దోపిడీకి పాల్పడిన వైసీపీ నేతలని  వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పైగా ఆ ఇళ్ల స్థలాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని కోరారు.

 

ఇక టీడీపీ చేసే ఆరోపణలకు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. టీడీపీ ఏదొరకంగా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఫైర్ అవుతున్నారు. అసలు దోపిడీ జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తే ప్రజలే తిప్పికొడతారని, అందుకే ఇళ్ల పట్టాలు అందుకనే లబ్దిదారులు నుంచి నిరసన ఎదురుకున్నారని, పరువు పోగొట్టుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: