కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ 40 రోజులుకుపైనే అమలైన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల ఎమర్జన్సీ సేవలు తప్ప, మిగతా సేవలన్నీ బంద్ అయ్యాయి. కానీ కరోనా ప్రభావం తగ్గకపోవడం, ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోవడంతో లాక్ డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి.

 

దీంతో 40 రోజులుకుపైగా మందులేక నానా ఇబ్బందులు పడ్డ మందుబాబులు ఒక్కసారిగా షాపులు వైపు ఎగబడ్డారు. మొదట్లో వైన్ షాపులు దగ్గర ఉన్న రద్దీ నిదానంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతానికైతే మందుబాబులు ఎలాంటి ఇబ్బంది పడకుండానే మద్యం తెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే మరో చిక్కు వచ్చి పడింది.

 

అమ్మకాలు లేకపోవడం వల్ల పాత మద్యం స్టాక్ షాపుల్లోనే నిల్వ ఉండిపోయింది. ఇక ఆ స్టాక్ ఇప్పుడు విక్రయిస్స్తున్నారు. ఈ క్రమంలోనే కాలం తీరిన మద్యాన్ని అమ్మేస్తున్నారు. అవి తాగడం వల్ల మందుబాబులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. మద్యం దొరికిందనే ఆనందంలో మందుబాబులు ఎక్స్‌పైరీ డేట్ కూడా చూసుకోకుండా కొనేసి తాగేస్తున్నారు. ఇక తర్వాత బాగా ఇబ్బందులు పడుతున్నారు.

 

ముఖ్యంగా ఎక్స్‌పైరీ అయిన బీర్లు అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీర్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవన్న సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం పరిధిలో ఓ చోట కాలం తీరిన బూమ్ బూమ్ బీరు తాగిన వ్యక్తికి ఒళ్ళంతా దద్దర్లు వచ్చాయట. ఈ నెల 6వ తేదీనే ఆ బీర్ కాలం చెల్లిపోగా, ఆ వ్యక్తి 13 తేదీన ఆ బీర్ కొనుగోలు చేసి తాగితే ఒంటిపై దద్దుర్లు తేలాయి. కాబట్టి మందుబాబులు కాస్త ఎక్స్‌పైరీ డేట్ చూసుకుని కొనుగోలు చేస్తే మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: