క‌రోనా వైర‌స్ విధ్వంసం కొన‌సాగుతుండ‌డంతో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతోంది. అన్నిరంగాలు కుదేల‌వుతున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలుతున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీలు ఉద్యోగులను తొల‌గించ‌డ‌మో.. జీతాలు పెద్ద‌మొత్తంలో క‌ట్ చేయ‌డ‌మో చేస్తున్నాయి. ఇక ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగమే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్నా దేశాలు, రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాదాపుగా ప్ర‌పంచ దేశాల‌న్నీ త‌మ స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి. అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌ను నిషేధించాయి. దీంతో  అంత‌ర్జాతీయంగా రాక‌పోక‌లు నిలిచిపోవ‌డంతో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు వెల‌వెల‌బోతున్నాయి. ఇక భార‌త్‌లో కేర‌ళ కూడా ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఒక‌టి. ఈ రాష్ట్రానికి కూడా తీవ్ర న‌ష్టం జ‌రిగింది. కేరళ పర్యాటక రంగానికి రూ. 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్యాకేజీని తీసుకురావాలని యోచిస్తున్నాం. ఈ విషయంపై ఇప్పటికే ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేశామని పేర్కొన్నారు.

 

అయితే.. మొద‌టి నుంచీ కేర‌ళ‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. అక్క‌డి ప్ర‌భుత్వం కూడా క‌ట్టుదిట్ట‌మైన చర్య‌లు తీసుకుంది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ రాష్ట్రం అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింది. ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోగ‌ల‌గారు. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన వందేభార‌త్ మిష‌న్ కార్య‌క్ర‌మంతో విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి నుంచి వ‌చ్చేవారు కూడా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. కేర‌ళ‌లో ప్ర‌స్తుతం ఈ కేసులే న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 576కు చేరుకుందని మంత్రి సురేంద్ర‌న్ అన్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారని ఆయ‌న‌ తెలిపారు. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: