లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకుపోయిన వ‌ల‌స‌కార్మికులు, కూలీల గాథ‌లు క‌న్నీళ్లుపెట్టిస్తున్నాయి. సొంతూళ్ల‌కు కాలిన‌డ‌క‌బ‌య‌లుదేరి వంద‌ల కిలీమీట‌ర్లు న‌డుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదాల‌కు గురై అనేక‌మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా.. సొంతూళ్ల‌కు చేరుకోవాల‌ని, క‌ష్ట‌కాలంలో పుట్టిన ఊర్లో ఉండాల‌న్న త‌ప‌న‌తో ముందుకుసాగుతూనే ఉన్నారు. తాజాగా.. ఓ గిరిజ‌నుడు ఏకంగా త‌న ఇద్ద‌రు కుమారులను కావ‌డిలో వేసుకుని 160కిలోమీట‌ర్లు న‌డిచి సొంతూరు చేరుకున్నాడు. ఆ గిరిజ‌నుడి పేరు రూప‌య తుడు. స్వ‌గ్రామం ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని మొరాడా బ్లాక్ పరిధిలోని బలాడియా గ్రామం. ఆయ‌న‌కు భార్య‌, ఆరేళ్ల కూతురు, ఇద్ద‌రు కుమారులు( ఒక‌రు నాలుగేళ్లు, మ‌రొక‌రు రెండున్న‌రేళ్లు). అయితే.. తుడు తన కుటుంబంతో కలిసి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్‌పూర్ జిల్లాలోని ఇటుక బట్టీలో పని చేయడానికి వెళ్లాడు. అక్క‌డ ప‌నిచేశాడు. ఇంత‌లోనే లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇంటికి తిరిగిరావాల‌ని అనుకున్నాడు. ఇటుబ‌ట్టీ య‌జ‌మాని కూడా డ‌బ్బులు ఇవ్వ‌లేదు.

 

చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు. త‌న భార్య మాత్రికా, ఆరేళ్ల కూతురు న‌డ‌వ‌గ‌లిగిన‌ప్ప‌టికీ ఇద్ద‌రు కుమారుల‌ను ఎలా తీసుకెళ్లాల‌న్న‌ది అర్థం కాలేదు. ఇంత‌లోనే ఆయ‌న‌కు ఉపాయం వ‌చ్చింది.  వెదురు బ‌ద్ద‌తో కావ‌డి క‌ట్టాడు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను కావ‌డిలో వేసుకుని న‌డ‌క‌ప్రారంభించాడు. ఏడు రోజుల‌పాటు న‌డిచి ఎట్ట‌కేల‌కు గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తినేందుకు తిండిలేక‌, తాగేందుకు నీళ్లు కూడా స‌రిగా దొర‌క‌క న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. అయినా.. రాత్రింబ‌వ‌ళ్లు న‌డిచి ఏడు రోజుల్లో గ్రామానికి చేరుకున్నారు. ఏడురోజుల పాటు భుజాల‌పై ఇద్ద‌రు కొడుకుల‌ను మోసుకొచ్చిన తుడును చూసి స్థానికులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. *నా దగ్గర తగినంత డబ్బు లేనందున, నేను కాలినడకన నా గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. మేము శుక్రవారం సాయంత్రం మా గ్రామానికి చేరుకోవడానికి 7 రోజుల ముందు నడవవలసి వచ్చింది. కొన్నిసార్లు పిల్లలను కావ‌డిపై మోసుకువెళ్ల‌డం కొంచెం బాధాకరంగా ఉంది, కానీ నాకు వేరే మార్గం లేదు* అని టుడు అన్నారు.

 

అయితే.. తుడు, అతని కుటుంబాన్ని గ్రామంలోని క్వారంటైన్ సెంట‌ర్‌లో ఉంచారు అధికారులు. వారు 21 రోజులు అక్క‌డే ఉండాలి. నిన్న కొంద‌రు నాయ‌కులు తుడు కుటుంబానికి, అక్కడే ఉన్న ఇతర కార్మికులకు ఆహార ఏర్పాట్లు చేశారు. కాగా, ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న 1.15 లక్షల మంది వలస కార్మికులు తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఒడిశాలో ఇప్పటివరకు 737 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 600 మంది వలస కార్మికులు ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: