రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం జీవో 203 చిచ్చు రేపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల‌ మాట్లాడుతూ ఏపీ స‌ర్కార్‌ కనీసం తమను సంప్రదించకుండానే పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంబంధించి జీవో నెంబర్ 203 తీసుకొచ్చిందని, ఇది తెలంగాణ ప్రజల హక్కులను హరించడమేన‌ని, తెలంగాణ‌లో పాల‌మూరుతోపాటు మ‌రికొన్ని జిల్లాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని.. ఈ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే..దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా స్పందించారు. కృష్ణా జలాల్లో అదనంగా ఉన్న వాటర్‌ను వాడుకునేందుకు మాత్రమే జీవో నెంబర్ 203 తీసుకొచ్చామని, ఏపీ ప్రజలకు ఉన్న‌ హక్కుల్లో భాగంగానే కృష్ణా జలాలను వాడుకుంటున్నామ‌ని, తెలంగాణకు అన్యాయం చేసేలా తాము వ్య‌వ‌హ‌రించడం లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో తెలంగాణ ఆలోచించాల‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఇక అప్ప‌టి నుంచి మ‌ళ్లీ సీఎం కేసీఆర్ స్పందించ‌లేదు.

 

ఇదే స‌మ‌యంలో కృష్ణాట్రిబ్యున‌ల్‌లోనూ తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా బోర్డు ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండ‌గా.. ఇక అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల నేతల మధ్య వాటర్ వార్ నడుస్తూనే ఉంది. అయితే.. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ ఫలాల్ని పొందేందుకు అమలుచేయాల్సిన ప్ర ణాళికపై తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులను ఆహ్వానించారు. అలాగే.. నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోదావరిజలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ సమగ్రంగా చర్చించి.. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంతోపాటు దేవాదుల, ఇతర ప్రాజెక్టుల ద్వారా 2020-21 నీటి సంవత్సరంలో ఎంత నీటిని వినియోగించుకోవాలనే దానిపై చర్చించనున్నారు. గోదావరి జలాలను సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేలా ప్రణాళికను రూపొందించే అవకాశాలున్నాయి. ఈ సంద‌ర్భంగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కం, సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై కూడా సీఎం కేసీఆర్ స్పందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే... కేసీఆర్ ఎలా స్పంద‌న ఉంటుంద‌న్న‌దానిపైనే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: