చైనా, అమెరికా మధ్య కరోనా వైర‌స్ వార్‌ కొనసాగుతూనే ఉంది. క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లు అయిన‌ చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకో రీతిలో రెచ్చిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి కూడా ట్రంప్‌ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ గురించి చైనా ప్రపంచానికి చెప్పలేదని, కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ప్రపంచాన్ని హెచ్చరించే లేదని, కావాలని చైనా ఆ విషయాన్ని దాచి పెట్టిందని అవకాశం దొరికినప్పుడల్లా డొనాల్డ్ ట్రంప్‌ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో క‌రోనా వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అనికూడా ఆయ‌న అన్న విష‌యం తెలిసిందే. తాజాగా... చైనాకు మరోసారి భారీ షాక్‌లాంటి వార్త డోనాల్డ్ ట్రంప్ వినిపించారు. త‌మదేశ‌ పింఛను నిధి నుంచి చైనాలో పెట్టిన పెట్టుబడులున్నింటిని వెనక్కి తీసుకుంటామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్రమంగా ఆ దేశంలో ఉన్న కంపెనీలన్నింటిని త‌మ‌ దేశానికి తెచ్చుకుంటామని, ఇక చైనాతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించబోమని ఆయన చెబుతున్నారు.

 

ఇదే సమయంలో భారత‌దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ప్రధానంగా రక్షణ వ్యవస్థలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ భాగస్వామ్యంగా ఉంటామని, ఇరు దేశాలు మరింత బలోపేతం అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చైనాను ఒంటరిని చేయడానికి డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తున్నారని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ, మాటల్లో చెప్పినంత సులభం కాదని, డోనాల్డ్ ట్రంప్‌కు ముందు ముందు పెను సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. ముందుగా అమెరికాలో ఏర్పడిన అత్యంత విపత్కర, అత్యంత విషాదకరమైన పరిస్థితులను చక్కదిద్దాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడిలో ట్రంప్‌ విఫలం చెందడం వల్లనే నేడు అమెరికా విలవిలలాడుతోందని.. దాని నుంచి అమెరికా ప్రజల దృష్టిని మరల్చేందుకే ట్రంప్‌ పదే పదే చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి మరి..!

మరింత సమాచారం తెలుసుకోండి: