ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికించేస్తోంది. ఈ మహమ్మారికి మహమ్మారికి పుట్టినిల్లయిన డ్రాగన్ దేశంలో  వైరస్‌ ప్రభావం తగ్గింది. భారత్‌లో మాత్రం వైరస్ తీవ్రత  కొనసాగుతోంది. ఒక్కరోజే దేశంలో 3 వేల 970 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో కరోనా సంఖ్యలో భారత్‌.. చైనాను దాటేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 82 వేల 900కే పరిమితమవ్వగా.. భారత్‌లో మాత్రం 86 వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ 11వ స్థానానికి ఎగబాకగా.. చైనా 13వ స్థానంలో నిలిచింది. అయితే వైరస్‌ కారణంగా సంభవించిన మరణాల్లో మాత్రం చైనా కంటే తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ సోకి 2 వేల 753మంది మరణించగా.. చైనాలో 4 వేల 6 వందల 33మంది ప్రాణాలు కోల్పోయారు.

 

గత ఏడాది డిసెంబరు నెలలో బయటపడిన కరోనా వైరస్‌ చైనాలో విలయతాండవం చేసింది. తక్కువ సమయంలోనే వుహాన్‌ నగరాన్ని అతలాకుతలం చేసి వేల సంఖ్యలో బాధితులుగా మార్చింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఊహించని విధంగా విజృంభించింది. అక్కడ ప్రతిరోజు సరాసరి 2 వేల 400పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా మార్చి మొదటివారానికే చైనాలో 80వేల కేసుల మార్కును దాటింది. మార్చి చివరినాటికి మాత్రం పాజిటివ్‌ కేసులు పదుల సంఖ్యకు పడిపోయాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 విజృంభించడం ప్రారంభించింది. ఇలా చైనాతో పోల్చుకుంటే 80వేలు దాటడానికి భారత్‌కి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.

 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపు కావడానికి 11రోజులు పడుతోంది. లాక్‌డౌన్‌ విధించక ముందు పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడున్నర రోజులకే రెట్టింపు అయ్యింది. భారత్‌లో రికవరీ రేటు 35శాతంగా ఉంది. ప్రస్తుతం 30 వేల153మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో 85 వేల కేసులుంటే.. 29 వేల బాధితులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. ముంబైలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ   17 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో 1,069  మంది చనిపోతే, ముంబైలోనే 650 మంది కన్నుమూశారు. తమిళనాడులోనూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్​గా చెప్పుకునే కోయంబేడు మార్కెట్​ నుంచి కేసులు భారీగా నమోదయ్యాయి. 

 

దేశంలో ప్రధాన సిటీలు అని చెప్పుకునే వాటిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్​, చెన్నై, కోల్​కతా, హైదరాబాద్​, భోపాల్​, జైపూర్​ వంటి సిటీల్లోనే ఎక్కువ మొత్తంలో కేసులు రికార్డవుతున్నాయి. ఈ సిటీల్లోనే 61 శాతం కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న తరుణంలో భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: