బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త. త్వరలోనే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని షరతులు విధిస్తూ అమ్మవారిని తరించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.   అందులో భాగంగా క్యూలైన్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు తప్పని సరి చేయనున్నారు.

 

కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఇంద్రకీలాద్రి కొలువైన దుర్గమ్మ భక్తులతో కొనియాడబడుతోంది. అలాంటి అమ్మవారిని తరించేందుకు భక్తులు ఎక్కడున్నా పరుగుపరుగున వస్తుంటారు. ఆమెను తనివితీరా చూసి మొక్కులను చెల్లించుకుంటారు. అలాంటి అమ్మవారిని చూసి భక్తులకు చాలా రోజులైంది. ఎపుడెపుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా ఎపుడు అమ్మవారిని చూద్దామా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి భక్తులకు త్వరలోనే శుభావార్త అందనుంది. 

 


కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన దుర్గగుడిలో... భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించటానికి దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు. క్యూ లైన్లలో భౌతికదూరం పాటించేలా సర్కిల్స్ గీశారు. వీటిలో నిల్చుని అమ్మదర్శనం కోసం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 300 రూపాయలు చెల్లిస్తే అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకోవచ్చు. అయితే కరోనా ఎఫెక్ట్ తో అమ్మవారి అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. ఉచిత దర్శనం , 100 రూపాయల క్యూ లైన్ల ద్వారా ముఖ మంటప దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తారు. వచ్చే వారంతా ఈ రెండు క్యూ లైన్ల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

 

గతంలో ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించేవారు. ఇప్పుడు ఆ సమయాన్ని కుదించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. రోజుకు 2400 టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. ఒకరోజు ముందుగా దర్శన టికెట్లను జారీ చేస్తారు. వాటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసి ఆలయానికి వస్తే.. గంటకు రెండు వందల మందిని మాత్రమే అమ్మ దర్శనానికి అనుమతి ఇస్తారు.

 

దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం సుమారు 50 చోట్ల శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. . రోజు వారీ అన్నదానం కొనసాగుతుంది.   ఆర్జిత సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనటానికి.. అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: