క‌రోనా క‌ల‌కలం నేప‌థ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 గ‌డువు నేటితో ముగియనుంది. లాక్ డౌన్ 4.o కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్ర‌క‌ట‌న‌పై అన్నివ‌ర్గాలు ఆస‌క్తి, ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటికి అనుగుణంగా కేంద్రం మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. దేశవ్యాప్తంగా నాలుగో విడుత లాక్‌డౌన్‌ సోమవారం నుంచి మొదలు కానుండ‌గా ఇందులో అనేక వెసులుబాట్లు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

 


అధికారిక వ‌ర్గాల క‌స‌రత్తును ఉటంకిస్తూ వివిధ మీడియా సంస్థ‌లు ఈ మేర‌కు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి. నాలుగో విడుత లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉండ‌గా ఆరెంజ్‌ జోన్లలో పరిమిత స్థాయిలో, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలు చేయనున్నారు. రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ క్షౌరశాలలు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు. వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్నారు.

 

ఇదిలాఉండ‌గా, దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 4,759 మందికి పాజిటివ్​ వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. శనివారం నాటి కేసుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి నమోదైనవే మూడున్నర వేలకుపైగా ఉన్నాయి. దేశ ఫైనాన్షియల్​ క్యాపిటల్​గా పేరున్న ముంబై సిటీలోనే కరోనా కేసులు 18 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,862 మంది చనిపోయారు. శనివారం మృతిచెందినవాళ్లు 109 మంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు చేరాయి. మృతుల సంఖ్య 3 లక్షల 10 వేలు దాటింది. అమెరికాలో కేసులు 15 లక్షలకు, మృతుల సంఖ్య 89,129కి చేరింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, తెలంగాణలోని 30 ప్రాంతాలను గుర్తించినట్లు సమాచారం. దేశంలో 80 శాతం కేసులు ఈ ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ 30 జోన్లలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: