అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇక రాజ‌కీయంగా గ‌డ్డురోజులేనా..? క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ఘోరంగా విఫ‌లం చెందిన ట్రంప్‌ ఇంటా బ‌య‌టా తిప్ప‌లు త‌ప్ప‌దా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. దీనికి సంకేతంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ చుర‌క‌లు అంటించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని... 75,000 మందికి పైగా అమెరికన్‌ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవవ‌ని.. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్‌చార్జ్‌లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదని ట్రంప్ పాల‌నా తీరును ఎండ‌గ‌ట్టారు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్‌ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని ఒబామా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నామ‌ని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు లేద‌ని, కనీసం నటించడం లేదంటూ ఒబామా విమర్శలు చేశారు.

 

కాగా.. గతంలోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోవిడ్‌–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముందుముందు అమెరిక‌న్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డం ఖాయ‌మేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: