ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇక ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఉదంతాలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి. వాస్త‌వానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి శత్రువు ఆకలి. దాన్ని జయించి జానెడు పొట్ట నింపుకొనేందుకు సొంతూరు వదిలి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చిన వారెందరో. అయితే ప్ర‌స్తుతం  లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో ప‌ట్ట‌ణాల్లో ప‌నిచేయ‌డానికి వ‌చ్చిన వ‌ల‌స కూలీల‌కు పని లేకుండా పోయింది. 

 

ఉండ‌టానికి స్థ‌లం లేదు. ఇక ర‌వాణా సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో పొట్ట‌చేత బ‌ట్టుకొచ్చిన వ‌ల‌స కూలీలు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలినడకనే ఎంతోమంది వెళ్లడం నిత్యం జరుగుతూనే ఉంది. ఈ టైమ్‌లో వారి బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మ‌రో వలస కూలీ క‌న్నీళ్లు పెట్టించే దీన‌ గాధ వెలుగులోకి వ‌చ్చింది. గుజరాత్‌లోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో తిలోకి కుమార్ పనిచేశాడు. శ్రామిక్ రైలులో ప్రయాణానికి తన పేర్లు నమోదు చేసుకొని వారం రోజులు గడిచినా ఎవరూ స్పందించకపోవడంతో తోటి కార్మికులతో కలిసి స్వగ్రామానికి కాలినడకనే బయలుదేరాడు.

 

అయితే దాదాపు 300 కిలోమీటర్ల దూరం నడిచాక తన కాళ్లకు ఉన్న చెప్పులు పూర్తిగా అరిగిపోయి.. తెగిపోయాయని చెప్పాడు. అరికాళ్ల నుంచి రక్తం వస్తోందని అన్నాడు. దీంతో చెప్పులకోసం వారినీ వీరినీ అడుగుతూ అతను ప్రాధేయపడ్డ తీరు అక్కడి వారిని క‌న్నీళ్లు పెట్టించింద‌ట‌. దారి మధ్యలో కొందరు అన్నం, నీళ్లు అందిస్తున్నారని, అయితే, తన కాళ్లకు చెప్పులు లేవని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇక చివ‌ర‌కు త‌న బాధ అర్థం చేసుకున్న ఓ వృద్ధులు లక్నో శివారులో ఓ షాపు నుంచి చెప్పులు కొని త‌న‌కు మ‌రియు త‌న‌తో పాటు ఉన్న మ‌రో వ‌ల‌స కార్మీకుడికి‌ అందించార‌ని చెప్పుకొచ్చాడు. కాగా, లాక్‌డౌన్ వేళ ఇలాంటి క‌న్నీళ్లు పెట్టించే ఘ‌ట‌న‌లు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: