పాలన చేయడం అంటే ఆషామాషీ కాదు, కోట్లాదిమంది తో కూడుకున్న వ్యవహారం. ఎవరికి నొప్పి తగిలినా సర్కార్ గిలగిలలాడాలి. అపుడే రాష్ట్రమైనా దేశమైనా కదిలేది, నిలిచేది. ఇపుడు చూస్తే దేశంలో లాక్ డౌన్ పేరిట అందరికీ ఇళ్లలో పెట్టేశారు. దాంతో ఎవరికీ పనీ లేదు, పాటు అంతకంటే లేదు.

 

దాంతో చేతిలో పైసా లేకుండా జనాలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో అర్జంటుగా  జనాల చేతుల్లో డబ్బులు పెట్టాలని ఆర్ధిక వేత్తలు సూచిస్తున్నారు. అపుడే నగదు మార్కెట్లోకి వచ్చి ఆర్ధిక వ్యవస్థ కాస్తా ముందుకు కదులుతుందని కూడా చెబుతున్నారు. దీని మీద కేసీయార్ నెల క్రితమే కేంద్రానికి సూచనలు చేశారు. హెలికాప్టర్ మనీ పేరిట పేదలకు  పంచాలని కోరారు.

 

అంటే ప్రతీ పేద వర్గం ఖాతాలో నగదు వేయాలని కోరారు. నగదు బదిలీ పధకం  అన్నమాట. దాని వల్ల సామాన్యుడి వద్ద ఉన్న డబ్బు మార్కెట్లోకి వస్తుంది. కొనుగోలు శక్తి వస్తుంది. అపుడు మార్కెట్ కి సందడి వస్తుంది. ఆ విధంగా నెమ్మదిగా పుంజుకుంటుంది. ఆర్ధిక వేత్తలు కూడా మొత్తుకునేది ఇదే.

 

ఇపుడు ప్రపచంలో లాక్ డౌన్ ప్రకటించిన దేశాలు కూడా ఇదే చెప్పాయి. అవే అక్కడ చేస్తున్నాయి కూడా.  అయితే కేంద్రం మాత్రం బడ్జెట్  కాపీలను చదువుతూ కాలక్షేపం చేస్తోంది. 20 లక్షల కోట్లతో మోడీ భారీ ప్యాకేజి ప్రకటించారు అనుకుంటే ఇపుడు అది పూర్తిగా తుస్సుమనిపించారు. దాని వల్ల రుణాలు, మాఫీలు, పెట్టుబడులు, రాయితీలు ఈ గొడవ చెబుతున్నారు కానీ అందులో సామాన్యుడు ఖాళీ జేబుకు ఉపశమనం లేదు.

 

అయితే ఏపీలో మాత్రం జగన్ అలా చేయడంలేదు. లాక్ డౌన్ ఇలా ప్రకటించారో లేదో ఆయన ప్రతీ రేషన్ కార్డు ఉన్న వారి ఖాతాలో వేయి రూపాయలు నగదు పెట్టారు. అంతే కాదు, వివిధ పధకాలు కూడా అమలు చేయడం ద్వారా ఆయా వర్గాల చేతికి నేరుగా డబ్బు చేరేలా చూస్తున్నారు. రైతులకు భరోసా పేరిట నగదు బదిలీ చేసిన జగన్ తద్వారా యాభై లక్షల మంది చేతిలో కరెన్సీ కరకరలాడించారు.

 

ఇపుడు జూన్ నెలలో చూసుకుంటే వాహన మిత్ర పేరిట భారీఎత్తున  లబ్దిదారులకు పది వేల రూపాయలు ఇస్తున్నారు. ఇలా డబ్బు ఇవ్వడం వల్ల మార్కెట్ కి ఆ డబ్బు అంతా చేరుతుంది. వారిలో కొనుగోలు శక్తి పెరిగి బజార్లు కళకళలాడతాయి. ఆగిన అర్ధిక చక్రం పరుగులు తీస్తంది. మరి ఏపీ లాంటి ఇబ్బందులో ఉన్న రాష్ట్రం చేసిన పనిని దేశాన్ని ఏలే పెద్దలు చేయకపోవడమేంటన్న ప్రశ్న అందరూ వేస్తున్నారు.

 

ఇప్పటికైనా కేంద్రం నగదు బదిలీ పధకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అపుడే లాక్ డౌన్ వల్ల ఆగిన ప్రగతికి సరైన జవాబుగా ఉంటుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: