దేశంలో కరోనా మహమ్మారి క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. మునుప‌టి కంటే కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 3029 మంది బాధితులు మరణించారు. ప్ర‌స్తుతం దేశంలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 36,823 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదే స‌మ‌యంలో దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వస్తోంది. ఇది కరోనాపై పోరులో కొత్త సవాళ్లను విసురుతోంది. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన కరోనా కేసులు క్రమంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో ఇప్పటివరకు 550 జిల్లాలు కరోనా బారిన పడ్డాయి.

 


లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల ప‌రిస్థితి, వారి స్వస్థలాలకు తరలి వెళ్లే స‌మ‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందులు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున్నే వైర‌ల్ అయ్యాయి. వారి ఆవేద‌న అనేక మందిని క‌ల‌చివేసింది. దీంతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో నరగాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు, కాలినడకన, లారీలు, ఇలా వివిధ మార్గాల్లో కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీనివల్ల గత పదిహేను రోజుల్లో సుమారు 180 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇలా మే 1 తర్వాత బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 

 

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో గత శనివారం వరకు నమోదైన మొత్తం కేసుల్లో 21 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదైనవే ఉన్నాయి. వలస కార్మికుల తరలింపునకు అనుమతించే వరకు ఒడిశాలో అతితక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ మే 1 తర్వాత రాష్ట్రంలోని గాంజాం లాంటి జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. గంజాంలో ఇప్పటివరకు 292 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా బీహార్‌లోని ముంగర్‌ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. 

ఇలా బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, హర్యానాలోని అన్ని జిల్లాల్లో, ఒడిశాలోని సగానికిపైగా జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లోని 50 జిల్లాల్లో, రాజస్థాన్‌, జార్ఖండ్‌లోని సగం జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇప్పటివకు నమోదైన 11,224 కేసుల్లో 30 శాతం కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవే ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలోని రెడ్‌ జోన్లలో ఉన్న హర్యానాకు చెందినవారు తమ స్వస్థలాకు వెళ్లడంతో అక్కడి మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,053 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1198 మంది మరణించారు. గుజరాత్‌లో 11,379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదగా, 659 మంది మృతిచెందారు, తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు  78 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 160 మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: