గత కొన్ని రోజులుగా నర్సీపట్నం అనస్థీషియా డాక్టర్‌ సుధాకర్‌ విషయంపై ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ 95 మాస్కులు, పి‌పి‌ఈ కిట్లు లేవని చెప్పి సుధాకర్ ప్రశ్నించగా, ఆయన టీడీపీ డైరక్షన్ లోనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని చెప్పి, జగన్ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇక ఆ సస్పెన్షన్ దుర్మార్గమని చెప్పి, కొన్ని రోజులు టీడీపీ వాళ్ళు హడావిడి చేశారు.

 

అయితే మళ్ళీ సుధాకర్ విశాఖలో నడిరోడ్డు మీద అర్ధనగ్నంగా ధర్నా చేశారు. దీంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ మద్యం తాగారని, మతిస్థిమితం కూడా సరిగా లేదని చెప్పి ఆయన్ని మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఆయనపై జగన్ ప్రభుత్వం దాడి చేస్తోందని, ఇది దారుణమని చెప్పి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ వారికి కౌంటర్‌గా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. డాక్టర్‌ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని చెప్పారు. ఇక అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని సుధాకర్‌ చెబుతుంటే.. అయ్యన్న మాత్రం ఆయనతో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అయితే మరోసారి డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు.

 

అయితే వైసీపీ ఎమ్మెల్యే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అంటుంది. కావాలనే ఈ రకంగా విమర్శలు చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని వాదిస్తున్నారు. అసలు ఎమ్మెల్యే సీటు ఇచ్చే టాపిక్ పూర్తిగా అవాస్తవమని చెబుతున్నారు. ఇది ఓ ప్లాన్ ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యే ఆడుతున్న డ్రామా అని, ఎంత డ్రామా ఆడిన సుధాకర్ కోసం పోరాడుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: