అంద‌రూ ఊహించిన‌ట్టుగానే..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంతో ఫైటింగ్ స్టార్ట్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీల‌ను చీల్చిచెండాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా రాజ్యాంగ బ‌ద్ధంగా ఏర్ప‌డిన‌వేన‌ని, కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తిని దెబ్బ‌తీస్తోంద‌ని అన్నారు. ఇంత క‌ష్ట‌కాలంలో కేంద్ర ప్ర‌భుత్వం చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కేంద్రం ప్ర‌క‌టించిన క్యాకేజీ అంతా ప‌చ్చిమోసం.. ద‌గా.. బోగ‌స్ అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో అనేక ష‌ర‌తులు పెట్టి, రాష్ట్రాల‌ను బిచ్చ‌గాళ్లుగా చూస్తోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాల‌ను ప‌ట్టించుకోలేద‌ని, కేంద్రం వైఖ‌రిని పూర్తిగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. అయితే.. ఈసారి మాత్రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పేరును ప్ర‌స్తావించ‌కుండానే.. కేసీఆర్ ఫైర్ కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి.. గ‌తంలోనూ కేంద్రం అనుస‌రిస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

 

ఈ రోజు రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్‌,వ్య‌వ‌సాయ పంట‌లు త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. చివ‌ర‌లో విలేక‌రులు ప్ర‌శ్న‌లు అడుగడంతో కేసీఆర్ మొద‌లు పెట్టారు. కేంద్రాన్ని ఏకిపారేశారు. కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన కండిష‌న్లు ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోబోమ‌ని, కేంద్రం ఇచ్చే ముష్టి రెండువేల‌కోట్ల రూపాయ‌ల రుణం త‌మ‌కేమీ అవ‌స‌రం లేద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ముందుముందు కేంద్రంపై ఎలా ఉంటుందో చూడండి అంటూ కేసీఆర్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయం వెడెక్క‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు కూడా స్పందించే అవ‌కాశం ఉంది. కేసీఆర్ మాట్లాడిన తీరుపై రాష్ట్ర బీజేపీ నేత‌లు, కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఘాటుగానే స్పందించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక‌రేప‌టి నుంచి తెలంగాణలో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుతుంద‌ని చెబుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: