ఏపీ సర్కారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా సగానికి సగం కోసేసింది. అయితే ఇంతటి కష్ట సమయంలోనూ జగన్ ఇచ్చిన మాట మాత్రం తప్పడం లేదు. తాను గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం రాజీ పడటం లేదు.

 

 

ఇందుకు వాహన మిత్ర పథకమే తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులందరికీ వాహన మిత్ర పథకం ద్వారా ఈ ఏడాది కూడా రూ.10 వేలు అందజేస్తామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నామన్నారు.

 

 

ఈ ఏడాది కూడా లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. కొత్తగా ఎవరైనా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసి ఉంటే ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. వాహన మిత్ర ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఒకే ఇంట్లో ఒకరిపై ఆటో ఉండి, మరొకరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నా ఈ పథకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు.

 

 

ఆర్టీసీ ప్రయాణాలపైనా స్పందించిన మంత్రి... ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగిని కూడా తొలగించలేదన్నారు. ఉద్యోగుల తొలగింపు వార్తలు నిజం కాదని మంత్రి పేర్నినాని తేల్చి చెప్పారు. ప్రయాణాలకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధంగానే ఉందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టేట్‌ టాస్క్‌పోర్స్‌ సూచనలు అమలు చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: