కేసీఆర్ జగన్ మధ్య స్నేహం గురించి ఈ రోజు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ విషయంపై వారిద్దరూ బహిరంగంగానే అనేకే వేదికలపై తమ స్నేహం గురించి చెప్పారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లారు. అక్కడ పెద్దన్న పాత్ర పోషించారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వచ్చారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌ లో అనేక సార్లు ఇద్దరూ ఏకాంతంగానూ.. అధికారికంగానూ భేటీ అయ్యారు.

 

 

ఇద్దరూ కలిసి గోదావరి జలాల సద్వినియోగంపై అనేక ఆలోచనలు చేశారు కూడా. అయితే ఇంతలో ఎందుకో మైత్రి చెడింది. జగన్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు జీవో ఇచ్చేశాడు. ఇది కాస్తా ఇద్దరి మైత్రికి ఆటంకంగా మారింది. మరి మైత్రి చెడ్డాక జగన్ జీవో ఇచ్చాడా.. లేక జీవో ఇచ్చినందువల్ల స్నేహం చెడిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇలాంటి నేపథ్యంలో సోమవారం మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. జగన్ తో స్నేహంపై తనదైన శైలిలో స్పందించారు.

 

 

ఎటూ తేల్చకుండా ఇంకా సస్పెన్సు కొనసాగించారు. ఇదే విషయాన్ని ఓ విలేఖరి అడిగితే.. ‘‘మేం ఫిర్యాదు ఇచ్చినం. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో కడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం అన్నారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో చొరవ తీసుకోమని కేంద్రాన్ని కోరతారా అని ఒక మీడియా ప్రతినిథి అడిగితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.

 

 

ఇంకా ఏమన్నారంటే.. " నీకేదో పంచాయతీ పెట్టాలని కోరిక ఉన్నట్లుంది.. అదేం జరుగదు. దురాశ పడకు. కేసీఆర్‌తో పెట్టుకోలేవు జాగ్రత్త’అని బదులిచ్చారు. ఇప్పుడు కూడా ఏపీతో కలిసే పనిచేస్తున్నాం. మాకెలాంటి వివాదాలు లేవు. బావుంటే మంచిమాట. తేడావస్తే కొట్లాట ’’ అన్నారు కేసీఆర్ . తాము కలిసుంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. మరి దీని అర్థం ఏంటి.. ఇంతకూ జగన్ తో కలసి పని చేస్తున్నట్టా.. తేడా వచ్చినట్టా.. అంత స్నేహం ఉంటే.. ఒక్కో ఫోన్ కాల్ తో పరిష్కారమయ్యేదానికి బోర్డుల వరకూ వెళ్లడం ఎందుకు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: