తెలంగాణ‌లో ఇక నుంచి ప్ర‌భుత్వం సూచించిన పంట‌ల‌నే సాగుచేయాల‌ని, నియంత్రిప‌ద్ధ‌తిలోనే రైతులు పంట‌లు పండించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏ పంట‌లు ఎన్ని ఎక‌రాల్లో సాగుచేయాలో కూడా ఆయ‌న నిన్న విలేక‌రుల స‌మావేశంలో చెప్పారు. ఈసారి వరి 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించాలని, ప‌త్తి 70 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించాలని ఆయ‌న సూచించారు. అలాగే.. 15 ల‌క్ష‌ల ఎక‌రాల్లో కంది, 2 లక్ష‌ల ఎక‌రాల్లో కూర‌గాయ‌లు, ప‌సుపు 1.25 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ప‌సుపు,  మిర్చి 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించాల‌ని అన్నారు. ఇక సోయాబీన్ 3.35 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించాల‌ని సూచించారు. అంత‌ర్జాతీయం, జాతీయంగా ఉన్న డిమాండ్ బ‌ట్టి పంట‌లు పండిస్తే..లాభం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, రైతుల కోస‌మే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. అయితే.. ఇదే స‌మ‌యంలో మిగ‌తా మ‌రికొన్ని పంట‌ల‌ను కూడా ఇదే ప‌ద్ధ‌తిలో కేసీఆర్ చెబితే బాగుండున‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. మ‌న‌దేశం ఎక్కువ‌గా వంట నూనెల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో వేరుశ‌న‌గ‌, పొద్దుతిరుగుడు, ఆముదం పంట‌ల‌ను కూడా ఎక్కువ‌గా పండించాల‌ని కేసీఆర్ చెబితే బాగుండున‌ని అంటున్నారు.

 

అలాగే.. సిరిధాన్యాల సాగుపై కూడా ప్ర‌భుత్వం దృష్టిసారించాల‌ని సూచించారు. అయితే.. ఇందులో ఎక్కువ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌త్తిపంట‌పైనే దృష్టిసారించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఇంత పట్టుబట్టారని ఆలోచిస్తే.. దీని వెనుక బలమైన కారణమే ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బట్టకు తీవ్రమైన కొరత ఉందని, ఈ నేపథ్యంలోనే పత్తి పంటను ఎక్కువగా సాగు చేయాలని నిపుణుల సూచనల మేరకు కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో మాస్కులు ఎక్కువగా వాడడం వలన ఇప్పటి వరకు ఉన్న మొత్తం బ‌ట్ట‌ను కూడా మాస్క్‌ల‌ తయారీకి ఎక్కువగా వినియోగించారు. తెలంగాణలోనే అత్యాధునిక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వ‌ల‌స‌ వెళ్లిపోయిన చేనేత కార్మికులను స్వ‌రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: